Begin typing your search above and press return to search.

వైకాపా కు బూస్ట్ దొరికినట్లేనా?

By:  Tupaki Desk   |   21 Sep 2016 7:52 AM GMT
వైకాపా కు బూస్ట్ దొరికినట్లేనా?
X
తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు టిడిపి నుంచి గెలిస్తే.. వారిలో 12 మంది తెరాసలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి "తెరాసలో టీడీపీ విలీనం"పై హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా తీర్పు వెలువరిచింది. 3నెలల్లోగా 12మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ కు సూచించింది. అయితే ఈ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలకంటే ఏపీ వైకాపా నేతలే ఫుల్ హ్యాపీగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తుంది!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి... తమ పార్టీని తెరాసలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ముందుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై చర్య తీసుకోవాలని ఆదేశించింది. అయితే విలీనం సంగతి కాసేపు పక్కనపెడితే... తొలుత ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోవాలని, అది కూడా మూడు నెలల్లో తీసుకోవాలని హైకోర్టు చెప్పడంపై ఏపీలో ప్రతిపక్షం హుషారుగా ఉందట. తెలంగాణలో 15 మంది టిడిపి నుంచి గెలిస్తే 12 మంది తెరాసలో చేరాగా.. ఏపీలో 67 మంది వైసిపి ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో సుమారు 20 మంది టిడిపి కండువాలు కప్పేసుకున్నారు.

అయితే ఈ విషయంపై ఏపీలో అధికార టీడీపీని వైసీపీ - ఆ పార్టీ అధినేత జగన్ మరింత ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పై కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకుంటే.. ఇదే క్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పై కూడా మరింత ఒత్తిడి పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటే... ఏపీలో మాత్రం ఎందుకు తీసుకోరని మరింత బలంగా ప్రశ్నించే అవకాశముందనేది వారి లాజిక్ గా ఉంది.