Begin typing your search above and press return to search.

రవి ప్రకాశ్ బుక్కైపోయినట్టే... హైకోర్టు వ్యాఖ్యలే సాక్ష్యం

By:  Tupaki Desk   |   11 Jun 2019 12:51 PM GMT
రవి ప్రకాశ్ బుక్కైపోయినట్టే... హైకోర్టు వ్యాఖ్యలే సాక్ష్యం
X
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ నిజంగానే అడ్డంగా దొరకిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను స్థాపించిన టీవీ 9ను కొత్త యాజమాన్యం కొనుగోలు చేయగా... ఆ యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టకుండా రవిప్రకాశ్ అడుగడుగునా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంతకాల ఫోర్జరీ, నిధుల మళ్లింపు తదితర ఆరోపణలపై కొత్త యాజమాన్యం అలంద మీడియా రవిప్రకాశ్ పై కేసులు పెట్టింది. ఈ కేసుల్లో చాన్నాళ్ల పాటు పోలీసులకు కనిపించకుండా తిరిగిన రవిప్రకాశ్... ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టు కూడా ససేమిరా అనడంతో పోలీసుల ఎదుటకు రాక తప్పలేదు. ఈ క్రమంలో విచారణకు ఏమాత్రం సహకరించకుండా వ్యవహరిస్తున్న రవిప్రకాశ్ ను మరింత కాలం పాటు విచారించాల్సి ఉందని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు హైకోర్టును కోరారు. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు నిన్ననే విచారణ చేపట్టగా... నేటికి వాయిదా పడింది.

నేటి విచారణలో భాగంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే... రవిప్రకాశ్ కు ఇకపై బెయిల్ దొరికే ఛాన్సే లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా కోర్టు ఎదుట పోలీసులు పెట్టిన ఆధారాలను చూస్తే... రవిప్రకాశ్ ఈ కేసు నుంచి అంత ఈజీగా బయటపడే ఛాన్సే లేదన్న వాదానా లేకపోలేదు. అయినా నేటి విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలేమిటి? ధర్మాసనం ముందు పోలీసులు పెట్టిన ఆధారాలు ఏమిటన్న విషయానికి వస్తే.. రవిప్రకాశ్‌ కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని... అందుకే రవిప్రకాశ్ కు బెయిల్‌ను నిరాకరించాలని హైకోర్టుకు విన్నవించారు. దేవేందర్‌ అగర్వాల్‌ రిజైన్‌ లెటర్‌లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు.

సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ.. వారితో జరిపిన ఫోన్‌ చాటింగ్‌ స్ర్కీన్‌షాట్స్‌ ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌ కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌ కు బెయిల్‌ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టు సంచలనాత్మక ప్రశ్నను సంధించింది. దీంతో రవి ప్రకాశ్ తరఫు న్యాయవాది తెల్లముఖం వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.