Begin typing your search above and press return to search.

జైలు భయం కార్బైడ్ కనిపించకుండా చేస్తుందా?

By:  Tupaki Desk   |   17 Sep 2015 6:04 AM GMT
జైలు భయం కార్బైడ్ కనిపించకుండా చేస్తుందా?
X
ధనార్జన తప్పించి మరే విషయాలు పట్టని వ్యాపారుల కారణంగా విషతుల్యమైన పండ్లు మార్కెట్ లో రాజ్యమేలేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఈ మధ్య కాలంలో కదలిక రావటం.. హైకోర్టు సీరియస్ అయి.. పండ్లును కార్బైడ్ తో మగ్గించి పండుగా మార్చేస్తున్న వైనంపై సీరియస్ కావటం తెలిసిందే.

దీనిపై విచారించిన ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పండ్ల మార్కెట్లలో శాంపిల్స్ సేకరించి.. వాటి ఫలితాలు వెల్లడించాలని చెప్పటం.. పలు దుకాణాల్లో సేకరించిన పండ్లలో విష తుల్యమైన కార్బైడ్ ఉండటం.. దానిపై హైకోర్టు మరింతగా సీరియస్ కావటం తెలిసిందే. తాజాగా ఇదే అంశం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా కార్బైడ్ రసాయనం వాడి కాయల్ని పండ్లుగా మార్చే వైనంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి హైకోర్టుకు విన్నవించింది. దీని ప్రకారం.. కాయలను ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టి అమ్మటాన్ని నేరంగా భావించి కేసులు నమోదు చేయనున్నట్లు కోర్టుకు చెప్పింది. అంతేకాదు.. కార్బైడ్ తో మాగబెట్టిన కాయల్ని అమ్మే వారికి ఆర్నెల్ల జైలు శిక్ష.. రూ.లక్ష వరకూ జరిమానాను విధిస్తామని పేర్కొంది. పండ్ల మార్కెట్ వద్ద కార్బైడ్ కారణంగా జరిగే పరిణామాల్ని వివరిస్తూ పండ్ల మార్కెట్ వద్ద బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

అంతేకాదు.. పండ్లు అమ్మే వ్యాపారస్తుడు.. తాను అమ్మే పండ్లు కార్బైడ్ తో పండించలేదన్న విషయాన్ని కూడా చెప్పాలి. ఈ దిశగా హామీ కూడా ఇవ్వాలి. అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టనున్నట్లు కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. జరిమానా.. జైలుశిక్షల కంటే కూడా.. కాయలకు కార్బైడ్ వినియోగం కారణంగా ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని తెలియజేసే బోర్డుల్ని ఏర్పాటుతో పాటు.. పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యాన్ని పెంచే అవకాశం ఉన్న పండ్లు.. కార్బైడ్ కారణంగా ఎంతటి అనారోగ్యాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారాన్ని వెనువెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాయలు అమ్మే చిరు వ్యాపారులకు తాను అమ్మేది పండ్లు కాదని.. ఆ రూపంలో ఉన్న విషమని తెలుస్తుంది. కోర్టులు.. జైలు లాంటి మాటలతో పాటు.. కార్బైడ్ మినహాయించి అమ్మాల్సిన అవసరాన్ని అర్థమయ్యేలా చెబితేనే.. కార్బైడ్ ముప్పు తొలుగుతుంది. లేకుండా నాలుగు రోజులు హడావుడి చేసే అంశంగా మిగిలిపోతుంది. అందుకే.. కోర్టులు తరచూ ఈ అంశాన్ని పరిశీలించటం.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని మదింపు చేయటం అత్యవసరం. మరి.. ఈ విషయంలో మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.