Begin typing your search above and press return to search.

ఆ అంశంపై ప్రచారంపై హైకోర్టు అసంతృప్తి

By:  Tupaki Desk   |   23 Jan 2016 4:39 AM GMT
ఆ అంశంపై ప్రచారంపై హైకోర్టు అసంతృప్తి
X
సహజసిద్ధంగా కాకుండా.. రసాయనాల ద్వారా పండ్లను మాగబెట్టే వైఖరిపై హైకోర్టు కొద్దిరోజులుగా కొరడా ఝుళిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి అక్రమ పద్ధతిపై కన్నెర్ర చేసి.. పండ్ల వ్యాపారులు నిబంధనలు పక్కా అమలు చేసేలా చూడాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల అమలు అంతంత మాత్రంగా ఉండటంపై తాజాగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

రెండు తెలుగురాష్ట్రాల్లో అక్రమపద్ధతిలో పండ్ల వ్యాపారులు పండ్లను మగ్గిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. పండ్ల కార్బైడ్ వినియోగంపై ప్రచారం కల్పించటంతో అంత సీరియస్ గా చేసినట్లుగా కనిపించలేదంటూ వ్యాఖ్యలు చేసింది. కార్బైడ్ వినియోగం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నా.. ఈ అంశంపై అవగాహన కల్పించటంలో రెండు తెలుగు రాష్ట్రాలు తామిచ్చిన ఆదేశాల్ని పాటించటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కార్బైడ్ వినియోగంపై ఆరోగ్యానికి కలిగే నష్టంపై ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు.. ప్రధాన కూడళ్లలోనూ.. మార్కెట్లలోనూ విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉన్నా.. రెండుప్రభుత్వాలు తమ ఆదేశాల్ని పాటించటం లేదన్న హైకోర్టు ప్రశ్నతో.. పరిస్థితి తీవ్రతను రెండు రాష్ట్రాల అధికారులు పట్టించుకోవటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఏపీ సర్కారు న్యాయవాది స్పందిస్తూ.. తమ సర్కారు ఈ ప్రచారానికి రూ.8.38 కోట్లు విడుదల చేసిందని చెప్పగా.. ఈ అంశంపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు తమకు సమయం కావాలని తెలంగాణ న్యాయవాది కోర్టును కోరారు. హైకోర్టు చేసిన తాజా అసంతృప్త వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలకు చురుకు పుట్టిస్తాయా?