Begin typing your search above and press return to search.

హై అలర్ట్.. దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది..!!

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:36 AM GMT
హై అలర్ట్.. దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది..!!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లాంటి దేశాల్లో రోజు వారి నమోదయ్యే కేసుల సంఖ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నమోదయ్యే కేసుల్లో కొత్త వేరియంట్ కేసులు అధికంగా ఉండడం ఆయా దేశాల ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ పై పోరాడేందుకు ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సినేషన్ ను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కు సంబంధించి తీసుకొని రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా ఇస్తున్నాయి. కానీ కొత్త కేసులు నమోదు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ఒక్క అమెరికాలో మాత్రమే కొత్తగా నమోదు అయ్యే కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదయ్యే కేసుల్లో ఎక్కువ కేసులు ఒమిక్రాన్ కు సంబంధించినవే అని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే భారత్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి నమోదయ్యే కేసుల సంఖ్య అమాంతంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2 వారాల క్రితం కేసుల సంఖ్య కేవలం 10 వేలు లోపు ఉండేవి. కానీ కొద్ది రోజుల నుంచి వెలుగు చూస్తున్నా కేసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసుల సంఖ్య సుమారు 20 శాతానికి పైగా పెరిగింది. దీంతో వైరస్ కు ఎలా అడ్డుకట్ట వేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో పాటు కొత్త వేరియంట్ కేసులు కూడా అంతకంతకు వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. దేశంలో మూడో వేవ్ ప్రారంభానికి కేసులు అధికంగా నమోదవడం ఓ సూచనగా భావిస్తున్నారు.


దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులలో మెట్రో నగరాల్లో వెలుగు చూస్తున్న కేసులు అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈ పెద్ద నగరాలలో నమోదవుతున్న కేసుల సంఖ్య లో కొత్త వేరియంట్ కు సంబంధించిన కేసులు సుమారు 75 శాతం వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. భారత్లో కొత్త వేరియంట్ కు సంబంధించిన మొదటి కేసు గత నెల మొదటి వారంలో నమోదయింది. అయితే నాటి నుంచి డిసెంబర్ నాలుగో నెల కు వచ్చే సరికి కేసులు సుమారు 28 శాతానికి పైగా పెరిగినట్లు డాక్టర్ అరోరా తెలిపారు. దీనిని బట్టి చూస్తే దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ అంతకంతకూ విస్తరిస్తోందని అర్థమౌతుందని చెప్పారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై లాంటి బడా నగరాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నట్లు అధికారులు గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటివరకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు 1700 లకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ కేసులు మహారాష్ట్ర నుంచే నమోదు అవుతున్నాయని అరోరా పేర్కొన్నారు. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను చూస్తే భారత్ లో మూడో వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన అన్నారు.