Begin typing your search above and press return to search.

ఆర్కే న‌గ‌ర్ బ‌రిలో విశాల్‌..త‌మిళ‌నాట సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   1 Dec 2017 1:17 PM GMT
ఆర్కే న‌గ‌ర్ బ‌రిలో విశాల్‌..త‌మిళ‌నాట సంచ‌ల‌నం
X
పొరుగు రాష్ట్రమైన తమిళనాట సంచలన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రాజకీయరంగం వైపు అడుగులు వేస్తున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉపఎన్నిక జరగనున్న ఆర్కే నగర్ స్థానంలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నెల 21న అక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక‌ల్లో విశాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో నిలబ‌డ‌తార‌ని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ బై పోల్ అనివార్యమైంది. సామాజిక అంశాల పట్ల తక్షణం స్పందించే నటులలో ఒకడు విశాల్. తమిళనాట జల్లికట్టు నుంచి మొదలు పెడితే మెర్సెల్ వరకు ఎన్నో అంశాల్లో విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. హీరోగానే కాకుండా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సినీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఈ నెల 21న ఆర్కేన‌గ‌ర్ లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 27 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయలేని బంధం ఉందనే విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే. తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న ఈ ట్రెండ్ నేప‌థ్యంలో ఇప్పటికే ప్రముఖ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌ - కమల్ హాసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. విలక్షణ నటుడు కమలహాసన్ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైనట్లు ఖరారైంది కూడా! ఇలా ఇద్ద‌రు ప్ర‌ముఖ న‌టులు త‌మిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స‌మ‌యంలో మ‌రో యువ హీరో తాను సైతం అని ప్ర‌క‌టించారు. కొద్దికాలం క్రితం హీరో విశాల్‌ రాజకీయాల్లో నా ఎంట్రీ షూరూ అని ప్ర‌క‌టించారు.

రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసేందుకు ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు ఈ ప్ర‌యత్నం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మిళ ప్ర‌జ‌లకు ఉత్త‌మ‌మైన ప్ర‌జా సేవ‌కుడిగా ఉండాల‌నేది త‌న ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుల‌ సంఘం ఎన్నికల్లోనూ - తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి విశాల్‌ సంచలనం సృష్టించారు. దానికి కొన‌సాగింపుగా...తాజాగా ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌తో రాజ‌కీయ అరంగేట్రం చేయనున్నార‌ని స‌మాచారం.