Begin typing your search above and press return to search.

పాటతో ‘ప్రత్యేక’ గళం విప్పిన హీరో

By:  Tupaki Desk   |   26 Oct 2015 6:24 PM GMT



ఏపీ విభజన తర్వాత.. సీమాంధ్రకు జరిగిన నష్టం గురించి.. దాన్ని అధిగమించేందుకు అవసరమైన ప్రత్యేక హోదా మీద సెలబ్రిటీ ఎవరైనా మాట్లాడారంటే.. అది కేవలం శివాజీ మాత్రమేనని చెప్పాలి. రాజకీయ నేతగా కాకున్నా.. ఉద్యమకారుడిగా.. సగటు సీమాంధ్రుడిగా ఆయన గళం విప్పినట్లుగా కనిపిస్తుంది. బీజేపీ నేతగా ఉన్నప్పటికీ.. శివాజీకి.. తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ పార్టీ నేతలు స్పష్టం చేయటం గమనార్హం.

సినిమాల్ని పక్కన పడేసి.. రోడ్ల మీదకొచ్చిన ఆయన.. ప్రత్యేక హోదా గురించి పోరాడే వారితో కలిసి తిరుగుతూ.. ప్రత్యేక హోదా మీద తన వాదనను గత కొంతకాలంగా వినిపిస్తున్నారు. ఏపీ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ నోటి నుంచి ప్రత్యేక హోదా కాకున్నా.. ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న సీమాంధ్రులకు నిరాశ కల్పించిన తీరుపై అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. శివాజీ లాంటి వారైతే రగిలిపోతున్నారు. అందుకేనేమో.. తన మనసులోని భావాలకు పాటగా తయారు చేసి.. ఆ వీడియోను తాజాగా విడుదల చేశారు.

‘‘ముందుకు రండి.. ముందుకు రండి.. భయపడొద్దు.. ప్రత్యేక హోదా.. సాధిద్దాం స్నేహితుడా.. ప్రత్యేక హదా మాక్కావాలి.. అంతకు మించిన వేరే మాటే లేదు’’ అంటూ 2.39 సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తన బాధను.. అక్రోశాన్ని సదరు వీడియోలో స్పష్టంగా వ్యక్తం చేశారు. పాట రూపంలో ఉన్న ఈ చిట్టి వీడియోలో సీమాంధ్రుల కష్టాల్ని.. ప్రత్యేక హోదా అవసరాన్ని.. విభజన వల్ల ఏర్పడి పరిస్థితుల్ని.. కేంద్రం చెబుతున్న మోసపూరిత మాటల్ని ప్రస్తావించటంతో పాటు.. అందరూ పిడికిలి బిగించి ప్రత్యేక పోరాటానికి సిద్ధం కావాలంటూ పిలుపునిస్తున్న వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరమని చెప్పటమే కాదు.. అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని శివాజీ తేల్చేస్తున్నారు. మరి.. ఆయన పిలుపునకు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.