Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల 'శివాజీ అస్త్రం' ఎంతలా దెబ్బేస్తుందంటే?

By:  Tupaki Desk   |   7 Jan 2020 12:01 PM IST
తమ్ముళ్ల శివాజీ అస్త్రం ఎంతలా దెబ్బేస్తుందంటే?
X
ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై తెలుగుదేశం పార్టీ అధినేత మొదలు టీడీపీ నేతలు వినిపిస్తున్న వాదన తెలిసిందే. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించే ప్రక్రియను.. కుట్రగా.. కుతంత్రంగా చూపిస్తూ.. లేనిపోని భయాల్ని చూపిస్తున్న వైనం ఒకపక్క నిరాటంకంగా సాగుతోంది. రాజధాని మార్పు విషయంలో టీడీపీ నేతలు వినిపిస్తున్న వాదనకు ఏపీ ప్రజల్లో స్పందన ఉండటం లేదు.

రాజధాని మార్పుతో తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని భయపడుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం తాము ఆశించినట్లుగా ఉండటం లేదు. ఇలాంటి సమయంలోనే నటుడు శివాజీ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల కాలంలో పలు విషయాల్లో ఎంట్రీ ఇవ్వటం.. ఉన్నట్లుండి మాయం కావటం తెలిసిందే. రాజధాని మీద రగడ చేస్తున్న తమ్ముళ్లకు అండగా ఉండేందుకు ఎంట్రీ ఇచ్చిన శివాజీ.. ఇప్పుడు వారికో తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు.

టీవీ చర్చల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజధాని మార్పుపై ప్రజల్ని ఒక తాటి మీదకు తెచ్చే సంగతి తర్వాత.. అతగాడి మాటలన్ని తాము రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్లుగా ఉన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా ఉండటం ఇబ్బందికి గురి చేస్తుంది. శివాజీ కారణంగా లాభం జరగకపోగా.. నష్టం వాటిల్లుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. తన వాదనను నిర్మాణాత్మకంగా వినిపించటం కంటే కూడా.. అధికారపార్టీని అదే పనిగా తిట్టేయటం.. తప్పులు ఎత్తి చూపించటం.. చిన్నబుచ్చేలా మాట్లాడటం.. చులకన చేయటం లాంటి వాటితో ఏపీ ప్రజలు హర్ట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఏదో సాయంగా నిలుస్తాడనుకున్న శివాజీ.. తమకు తలనొప్పిగా మారినట్లుగా తమ్ముళ్లు వాపోవటం గమనార్హం.