Begin typing your search above and press return to search.

జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటి.. బీజేపీకి సేవలందించేందుకు సిద్ధం?

By:  Tupaki Desk   |   27 Aug 2022 4:46 PM GMT
జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటి.. బీజేపీకి సేవలందించేందుకు సిద్ధం?
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటి ముగిసింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కు వచ్చిన హీరో నితిన్ కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నితిన్ తోపాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రామచంద్రరావులు ఉన్నారు.

హన్మకొండ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభకు హాజరైన జేపీ నడ్డా పలువురు ప్రముఖులతో భేటి అయ్యారు. శనివారం ఉదయం క్రికెటర్ మిథాలీ రాజ్ ను కలిశారు.తర్వాత రాత్రి నితిన్ తో భేటి అయ్యారు. నితిన్ తో నడ్డా భేటిపై సర్వాత్రా చర్చ జరిగింది.

ఇటీవల హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం.. ఇప్పుడు నడ్డా నితిన్ ను కలవడంతో బీజేపీ ప్లాన్ ఏంటని అందరూ ఆరాతీశారు. తాజాగా నితిన్ తో భేటి వివరాలను ఎంపీ లక్ష్మణ్ బయటపెట్టడంతో వైరల్ అయ్యింది.

నితిన్, మిథాలీతో జేపీ నడ్డా సమావేశాల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా స్వయంగా పాల్గొన్నారు. వీరి భేటిపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్, మిథాలీ లు ఇద్దరూ ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యారని.. త్వరలోనే వీరిద్దరూ ప్రధానిని కలిసే ఏర్పాట్లు చేస్తామన్నారు.

పార్టీకి సేవలందించేందుకు నితిన్, మిథాలీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటిలోనూ రాజకీయ చర్చ జరిగి ఉండవచ్చని తెలిపారు.

బీజేపీకి సినీ గ్లామర్ అందించేందుకే సినీ హీరోలతో భేటిలు అవుతున్నారని అర్థమవుతోంది. ఒప్పుకున్న వారితో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోనూ ఇలానే గ్లామర్ పాలిటిక్స్ అమలు చేసి బీజేపీ గెలిచింది. అప్పట్లో బీజేపీ తరుఫున హీరోలు యశ్, సుదీప్ లు కలిసి మద్దతు కోరారు. తెలంగాణలోనూ అదే అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది.