Begin typing your search above and press return to search.

హీరో మంచు మనోజ్ కారుకు జరిమానా విధించిన పోలీసులు

By:  Tupaki Desk   |   30 March 2022 6:35 AM GMT
హీరో మంచు మనోజ్ కారుకు జరిమానా విధించిన పోలీసులు
X
రూల్స్ పాటించకపోతే సామాన్యులైనా.. సెలబ్రెటీలు అయినా ఒక్కటేనని హైదరాబాద్ పోలీసులు నిరూపిస్తున్నారు. తాజాగా సినిమా స్టార్ల కార్లకు వరుసబెట్టి చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ చలానాలపై భారీ రాయితీలు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు.. మార్చి 31తో ఈ రాయితీలు ముగియనుండడంతో ముమ్మర తనిఖీలు నిర్వహించి పెండింగ్ చలానాలు వసూలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ముందు జూనియర్ ఎన్టీఆర్ కారుతోపాటు మరికొంతమంది ప్రజాప్రతినిధుల కార్లను సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారి కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సినీ హీరో మంచు మనోజ్ కారును అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులు నిబంధనలకు అనుగుణంగా బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు.

మెహిదీపట్నంలో వాహనాల తనిఖీ నిర్వహించిన టోలిచౌకీ ట్రాఫిక్ పోలీసులు అటుగా వెళుతున్న మంచు మనోజ్ ఏపీ 39HY 0319 కారును ఆపారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో దాన్ని తొలగించి రూ.700 ఫైన్ చలానా విధించారు. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా కారులో ఉన్నారు. పోలీసుల విధి నిర్వహణకు సహకరించారని పోలీసులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశానుసారం.. దేశంలో వైక్యాటగిరి, జెడ్, జడ్ ప్లస్ వంటి భద్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్లాక్ స్క్రీన్ ఉపయోగించాలని ఇటీవల ఆదేశించింది. కానీ సినీ సెలబ్రెటీలు బయట కనిపిస్తే జనాలు పోగవుతారని వాళ్లకు వాళ్లే బ్లాక్ స్క్రీన్ వేసుకుంటున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు కూడా బ్లాక్ స్క్రీన్ ను కార్లకు వేసుకుంటున్నారు.

ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి సామాన్యులు ఎవరైనా, సెలబ్రెటీలతో సహా అందరూ బ్లాక్ స్క్రీన్ తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సామాన్య ప్రజలు సెలబ్రెటీలను కార్లను గుర్తుపడితే సమస్యలు ఎదురవుతాయి. అందుకే వాళ్లకు వాళ్లే ఇలా రూల్స్ బ్రేక్ చేసి బ్లాక్ స్క్రీన్ వేసుకుంటున్నారు.