Begin typing your search above and press return to search.

హెరిటేజ్ ఫుడ్స్ షేరు చిక్కిపోతోందిగా!

By:  Tupaki Desk   |   16 July 2019 6:58 AM GMT
హెరిటేజ్ ఫుడ్స్ షేరు చిక్కిపోతోందిగా!
X
హెరిటేజ్ ఫుడ్స్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబాల వారికి వ్యాపారాలు.. ప‌రిశ్ర‌మ‌లు ఉండ‌టం కొత్తేం కాదు. పేరుకు ప్ర‌జాసేవ చేస్తున్న‌ట్లు చెప్పినా.. బ‌ల‌మైన వ్యాపారాల బ్యాక్ గ్రౌండ్ చాలామంది రాజ‌కీయ నేత‌ల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. టీడీపీ అధినేత‌.. ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు ముఖ‌విలువ అంత‌కంత‌కూ చిక్కిపోతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజ‌కీయాల‌కు వ్యాపారాల‌కు ఏ మాత్రం లింకు ఉండ‌ద‌న్న‌ట్లుగా చెప్పినా.. రాజ‌కీయ ప‌రిణామాలు బాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మీద మాత్రం బ‌లంగానే పడుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఏడాది క్రితం వ‌ర‌కూ షేరు మార్కెట్ లో దూసుకెళ్లిన హెరిటేజ్ ఫుడ్స్.. గ‌డిచిన కొద్ది నెల‌లుగా అంత‌కంత‌కూ బ‌ల‌హీన‌మ‌వుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏడాది వ్య‌వ‌ధిలో హెరిటేజ్ షేరు ముఖ‌విలువ ఏకంగా రూ.223 త‌గ్గిపోవ‌టం గ‌మ‌నార్హం. ఈ షేరు విలువ అత్య‌ధికంగా 2018 ఆగ‌స్టు లో రూ.624 వ‌ర‌కు వెళ్లింది. తాజాగా ఈ షేరు ధ‌ర రూ.374గా ఉండ‌గా.. ఈ రోజు ఇప్పుడు ( ఈ క‌థ‌నం రాసే స‌మ‌యానికి రూ.365గా ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే 2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏపీలో ఏర్పాటు అయిన నాటి నుంచి ఈ షేరు ధ‌ర అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. 2014 జులైలో 153 ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 2016 సెప్టెంబ‌రు నాటికి రూ.450కు చేరుకుంది. అలా అంత‌కంత‌కూ దూసుకెళ్లిపోయిన ఈ షేరు 2017 డిసెంబ‌రులో రూ.827కు చేరుకొని అంద‌రి దృష్టి త‌న ప‌డేలా చేసింది. అలా పీక్స్ కు వెళ్లిన హెరిటేజ్ ఫుడ్స్ త‌ర్వాత నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది చెప్పాలి. తిరోగ‌మ‌న‌మే త‌ప్పించి పురోగ‌మ‌నం లేని ప‌రిస్థితి.

2018 అక్టోబ‌రు మూడోవారానికి (ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా) రూ.437 కు ప‌డిపోయింది. ఆ త‌ర్వాత నుంచి అప్పుడ‌ప్పుడు పెరిగినా.. త‌గ్గ‌టమే ఎక్కువ‌ని చెప్పాలి. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో మే 23, 2019 నాడు రూ.480 ఉన్న షేరు ధ‌ర జూన్ 14, 2019 నాటికి రూ.412కు ప‌డిపోగా.. నెల వ్య‌వ‌ధిలో మ‌రింత కుంగిపోయి రూ.365కు త‌గ్గ‌టం గ‌మ‌నార్హం. ఏడాది వ్య‌వ‌ధిలో ఈ షేరు ధ‌ర దాదాపు రూ.225 వ‌ర‌కూ ప‌డిపోవ‌టం చూస్తే.. భవిష్య‌త్తులో ఈ షేరు ప‌రిస్థితి ఎంత‌మాత్రం ఆశాజ‌న‌కంగా ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది. బాబు రాజ‌కీయ జీవితంలో ఎగుడుదిగుళ్ల‌కు అనుగుణంగా హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధ‌ర ఉంద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. సో.. బాబు పుంజుకుంటే త‌ప్పించి హెరిటేజ్ ఫుడ్స్ కు మంచిరోజులు లేవ‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో!