Begin typing your search above and press return to search.

హెరిటేజ్‌ ను బేరం పెట్టిన బాబు

By:  Tupaki Desk   |   20 Sep 2016 5:46 AM GMT
హెరిటేజ్‌ ను బేరం పెట్టిన బాబు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారాల్లో మొట్ట‌మొద‌టిది - ఆయ‌న‌కు అత్యంత ఇష్ట‌మైన హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాను విక్రయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. సంస్థకు చెందిన రిటైల్ వ్యాపారాన్ని కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపునకు విక్రయించే దిశగా ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది. అయితే ఇంకా ఒప్పందానికి రాలేదని - సంప్రదింపులు పరిశీలన దశలోనే ఉన్నట్లు బీఎస్‌ ఈకి సంస్థ స్పష్టం చేసింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

1992లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ గ్రూపును ప్రారంభించారు. హెరిటేజ్ గ్రూపు ఫ్లాగ్‌ షిప్ కంపెనీ అయిన హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం డెయిరీ - రిటైల్ - అగ్రి - బేకరీ - పునరుత్పాదక విద్యుత్ - పశుపోషక విభాగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నది. రిటైల్ వ్యాపార విభాగంలో సంస్థ హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు నగరాల్లో 110కి పైగా సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తున్నది. ఇందులో 60కి పైగా స్టోర్లు హైదరాబాద్‌ లో ఉన్నాయి. ఇక బెంగళూరులో 16 - చెన్నైలో 34 స్టోర్లను నడుపుతున్నది. నెలకు 20 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గ్రూపు మొత్తం టర్నోవర్‌లో 25 శాతం రిటైల్ విభాగ వ్యాపారం నుంచే సమకూరుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ వ్యాపారం 18 శాతం వృద్ధి చెంది రూ.583 కోట్లకు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌ కు చెందిన రిటైల్ విక్రయ వ్యాపారాన్ని ఫ్యూచర్ గ్రూపు కొనుగోలు చేయనుందని, ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై సంస్థ స్టాక్ ఎక్సేంజ్‌ కు వివరణ ఇచ్చింది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్ టర్నోవర్ రూ.2,380.58 కోట్లుగా నమోదైంది. తాజాగా వాటా విక్రయ వార్తలతో స్టాక్‌ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. బీఎస్‌ ఈలో సంస్థ స్టాకుల ధర 10.20 శాతం ఎగబాకి రూ.901.90 వద్దకు చేరుకుంది. ఇంట్రాడేలో ఏకంగా 16.75 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.955.55 వద్దకు చేరుకున్నాయి. కానీ చివర్లో కాస్త దిగొచ్చాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ లో(ఎన్‌ ఎస్‌ ఈ) కంపెనీ షేరు 9.58 శాతం పెరిగి రూ.898.45 వద్ద స్థిరపడింది. బీఎస్‌ ఈలో సంస్థకు చెందిన 2.21 లక్షల షేర్లు చేతులు మారగా.. ఎన్‌ ఎస్‌ ఈలో 10 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. మ‌రోవైపు హెరిటేజ్‌ తో ఒప్పందం విజయవంతంగా పూర్తయితే ఫ్యూచర్ గ్రూపు సీఈవో కిశోర్ బియానీకి నాలుగేళ్ల‌లో ఇది నాలుగో కొనుగోలు కానుంది. 2012 నుంచి ఇప్పటివరకు ఈ గ్రూపు.. భారతీ రిటైల్ నుంచి ఈజీడే నెట్‌ వర్క్ - న్యూఢిల్లీకి చెందిన బిగ్ ఆపిల్ - హైదరాబాద్‌ కు చెందిన నీల్‌ గిరీస్ సూపర్ మార్కెట్లను టేకోవర్ చేసింది. హెరిటేజ్ ఫ్రెష్‌ ను కూడా దక్కించుకోగలిగితే ఫ్యూచర్ గ్రూపు స్టోర్ల సంఖ్య 850 మార్క్‌ను దాటిపోనుంది. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూపు దేశంలోని 221 నగరాల్లో 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పలు రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్నది. ఈ స్టోర్ల ద్వారా ఏటా 29.5 కోట్ల మందికి సేవలందిస్తున్నది.