Begin typing your search above and press return to search.

అయోధ్య వివాదం.. కీలక ఘాట్టాలివే..

By:  Tupaki Desk   |   9 Nov 2019 7:48 AM GMT
అయోధ్య వివాదం.. కీలక ఘాట్టాలివే..
X
అయోధ్య వివాదం.. దేశంలోనే అత్యంత క్లిష్టమైన సున్నితమైన ఈ కేసులో చారిత్రక తీర్పును నేడు సుప్రీం కోర్టు ఇవ్వబోతోంది. హిందువులు ఇదే రామజన్మభూమి అంటూ తమకే ఇవ్వాలని కోరడం.. ముస్లింలు ఇది బాబర్ కట్టించిన పవిత్ర బాబ్రీ మసీదు అనడంతో ఈ హిందు-ముస్లిం స్థల వివాదం కొన్ని ఏళ్లుగా నానుతోంది. దాదాపు 2.27 ఎకరాల ఈ భూమి తమదంటే తమది అని హిందూ -ముస్లింల మధ్య ఎప్పటినుంచో కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయినా ఏ కోర్టు, జడ్జి దీనిపై అయోధ్యయోగ్యమైన తుది తీర్పును ఇవ్వలేకపోతున్నాయి. దేశం మొత్తం ఊపిరిబిగబట్టి చూస్తున్న ఈ తీర్పుపై వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం ఈ వివాదానికి దారితీసిన పరిస్థితులను మనం తెలుసుకుందాం.

ఈ నేపథ్యంలో అసలు ఈ అయోధ్య వివాదం ఏంటి? ఎలా పుట్టింది. ? ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది. ఈ అయోధ్య వివాదానికి సంబంధించిన చరిత్రను మాత్రమే మనం తెలుసుకుందాం.

* చారిత్రక ఆధారాల ప్రకారం.. మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని అయిన మీర్ బాకీ 1528లో ‘బాబ్రీ మసీదును’ నిర్మించారు. ఆ తర్వాత ఇదే స్థలంలో 1853లో మొదటిసారి మత విద్వేశాలు, గొడవలు జరిగాయి..

* దీంతో అప్పటి బ్రిటీష్ సర్కారు ఈ వివాదాస్పద స్థలం చుట్టూ కంచె నిర్మించి 1859లో హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు.

*అయితే ఈ వివాదాస్పద స్థలంపై తొలి కేసు 1885లో కోర్టులో దాఖలైంది.

* యూపీలోని అయోధ్య బాబ్రీ మసీదులో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే 1949లో సీతారాముల విగ్రహాలను కొందరు పెట్టడం మత ఘర్షణలకు అల్లర్లకు దారితీసింది.

* హిందూ సంస్థ నిర్మోహి అఖాండా అయోధ్య స్థలం తమదేనంటూ 1959లో కోర్టును ఆశ్రయించింది.

* దీనికి ప్రతిగా అయోధ్యలో ఉన్న బాబ్రా మసీదు స్థలం ముస్లిం వర్గాలదేనని సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో 1981లో వాజ్యం వేసింది.

*1984లో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేయడంతో 1986 ఫిబ్రవరి 1న హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

*1989లో బాబ్రీ మసీదు వద్ద రామమందిర నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ పునాదిరాయి వేసింది. 1990లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వాణీ రామ రథయాత్రను ప్రారంభించారు.

* 1992 డిసెంబర్ 2న బాబ్రీ మసీదును హిందూ కరసేవకులు కూల్చివేయడం దేశంలో మతకల్లోలాలు, ఘర్షణలకు దారితీసింది. వందలాది మంది చనిపోయారు.

*2010 డిసెంబర్ 10న ఈ వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు 2.77 ఎకరాల భూమిని కక్షిదారులకు సమంగా పంచుతున్నట్టు అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

*2011లో దీనిపై సుప్రీం కోర్టుకు కొందరు ఎక్కడంతో సుప్రీం ఈ తీర్పుపై స్టే ఇచ్చింది.

*2017లో ఆగస్టు 7న మొదలైన విచారణను సుప్రీం కోర్టు సుధీర్ఘంగా విచారించింది. 2018 జూలై 20 వరకు తీర్పును వాయిదా వేసింది.

*2019 మార్చిలో అయోధ్య వివాదంపై మధ్యవర్తుల కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. వారు హిందూ ముస్లిం సంఘాలతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు.

* అక్టోబర్ లో అయోధ్యపై పూర్తి వాదనలు సుప్రీం కోర్టులో ముగిశాయి. తీర్పును సుప్రీం రిజర్వ్ లో ఉంచింది. 2019 నవంబర్ 9న ఈరోజు ఈ అయోధ్య వివాదంపై చారిత్రక తీర్పును ఇవ్వడానికి రెడీ అయ్యింది.