Begin typing your search above and press return to search.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ప‌రిస్థితి ఇలా!

By:  Tupaki Desk   |   18 April 2022 10:30 AM GMT
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ప‌రిస్థితి ఇలా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీలో కొంత‌మంది నాయ‌కుల ప‌రిస్థితి హఠాత్తుగా త‌ల‌కిందులైంది. ఒక‌ప్పుడు మంత్రులుగా ప్రజా కార్య‌క్ర‌మాల్లో తీరిక లేకుండా గ‌డిపిన నేత‌లు.. ఇప్పుడు మాజీ మంత్రులుగా కాలం గ‌డుపుతున్నారు. జ‌గ‌న్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో రెండు వారాల్లోనే మంత్రులు కాస్త ఎమ్మెల్యేలుగా.. కొంత మంది ఎమ్మెల్యేలు కాస్త మంత్రులుగా మారిపోయారు. 11 మంది పాత మంత్రుల‌ను కొన‌సాగించిన జ‌గ‌న్‌.. కొత్త‌గా 14 మందికి కేబినేట్లో అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. మంత్రి ప‌ద‌వులు పోగొట్టుకున్న నాయ‌కులు.. జ‌గ‌న్ కేబినేట్లో స్థానం ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు కూడా. కానీ జ‌గన్ వాళ్ల‌ను స‌ముదాయించిన‌ట్లు స‌మాచారం.

మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన వాళ్ల‌లో మాజీ ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కూడా ఉన్నారు. ఉప ముఖ్య‌మంత్రిగా స‌మీక్ష‌లు చేస్తూ.. అధికారిక కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపిన ఆమె.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌నే సందేహం రావ‌డం స‌హజం. మంత్రి ప‌ద‌వి పోగొట్టుకున్న ఈ మాజీ డిప్యూటీ సీఎం ఇప్పుడు కూర‌గాయలు పండిస్తున్నారు. అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.

ట‌మాటా, ప‌చ్చి మిర‌ప‌కాలు బుట్ట‌లో ప‌ట్టుకుని ఫోటోల‌కు ఆమె తాజాగా ఫోజులిచ్చారు. వీటిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కూర‌గాయ‌ల మొక్క‌ల‌కు నీళ్లు పడుతూ ఆమె క‌నిపించారు. మంత్రి ప‌ద‌వి పోయిన త‌ర్వాత ఆమె ప్ర‌శాంతంగా కూర‌గాయ‌ల పెంప‌కంపై దృష్టి సారించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కురుపం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున శ్రీవాణి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. బ‌ల‌మైన టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి ఆమె వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతో 2019లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ శ్రీవాణికి ప్రాధాన్య‌త‌నిచ్చారు. త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకుని అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రిగా ఆమెకు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

అంతే కాకుండా ట్రైబ‌ల్ వెల్ఫేర్ మంత్రిగానూ కొన‌సాగారు. కానీ ఇప్పుడు మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వస్థీక‌ర‌ణ నేప‌థ్యంలో ప‌ద‌వి కోల్పోయి కూర‌గాయ‌లు పండించుకుంటున్నారు. ఉప ముఖ్య‌మంత్రిగా ఒక‌ప్పుడు అధికార ద‌ర్పం చెలాయించిన ఆమె.. ఇప్పుడు ఇలా మారిపోవ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేమ‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.