Begin typing your search above and press return to search.

ముంబై కరోనా నుంచి కోలుకుందా? హెర్డ్‌ ఇమ్యూనిటీతోనే సాధ్యమైందా?

By:  Tupaki Desk   |   3 Nov 2020 8:10 AM GMT
ముంబై కరోనా నుంచి కోలుకుందా? హెర్డ్‌ ఇమ్యూనిటీతోనే సాధ్యమైందా?
X
కరోనా వచ్చిన కొత్తలో వైద్య నిపుణులు, ప్రభుత్వాలు ఆందోళన చెందింది ముంబై నగరం గురించే. మురికివాడలు, ఇరుకు సందులు అత్యధికంగా ఉండే ముంబైలో గనక కరోనా వ్యాపించిందంటే ఆపడం ఎవరీ తరం కాదని వైద్యులు అంచనా వేశారు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను ఊహించుకొని ఆందోళన చెందారు. కానీ భయపడ్డ రీతిలో ముంబైలో కరోనా ప్రభావాన్ని చూపలేదు. ముంబైలోని మురికి వాడల్లో దాదాపు 80 శాతం మందికి కరోనా సోకింది. కానీ వాళ్లంతా చాలా తొందరగా కోలుకున్నారు. అక్కడ ప్రజల్లో ఉన్న రోగనిరోధకశక్తి వల్ల కరోనా సోకినా తొందరగా కోలుకున్నారని వైద్యులు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ముంబైలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని మురికి వాడల్లో 80 శాతం, ఇతర ప్రాంతాల్లో 55 శాతం మంది కరోనా బారిన పడ్డారు.

జనవరి కల్లా ముంబై వ్యాప్తంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ (టీఐఎఫ్ ఆర్ ) అధ్యయనంలో తేలింది. అయితే, జులై, సెప్టెంబర్లతో పోలిస్తే ముంబయిలో కొవిడ్‌-19 ఉద్ధృతి మునపటిలా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నట్టు దీపావళికి కూడా జనాలు ఒక దగ్గరకి చేరినా... వైరస్‌ కేసుల్లో పెరుగుదల తక్కువగానే ఉండొచ్చంటున్నారు నిపుణులు. అక్కడ దసరా వేడుకల్లో, వినాయక చవితి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలోనే గుమిగూడారు. కానీ కరోనా ఎక్కువగా వ్యాపించలేదు. అందుకు కారణం ప్రజల్లో రోగనిరోధకశక్తి పెరగడమే. జనవరి నాటికి ముంబైలో నివసించే వారందరికీ కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.