Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్ టూర్ మ‌ళ్లీ కామెడీ అయిపోయింది

By:  Tupaki Desk   |   18 April 2018 4:33 PM GMT
కేసీఆర్ ఫ్రంట్ టూర్ మ‌ళ్లీ కామెడీ అయిపోయింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు క‌లిసి రావ‌డం లేన‌ట్లుంది. ఓ వైపు ఆయ‌న సీరియ‌స్‌ గా ప్ర‌య‌త్నిస్తుంటే...అందుకు త‌గిన రీతిలో ప్ర‌చారం చేసుకుంటుంటే...ఆచర‌ణ‌లో మాత్రం గ‌ట్టి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. సాక్షాత్తు ఆయ‌న కార్యాల‌యం నుంచి విడుద‌ల‌యిన ప్ర‌క‌ట‌న‌ను కామెడీ చేస్తూ..స్వ‌యంగా ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ క్లారిటీ ఇచ్చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది. కాంగ్రెస్ - బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నవీన్‌ పట్నాయక్‌ తో కేసీఆర్‌ చర్చించనున్నారని.... ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దరిమిలా మే మొదటివారంలో రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా నవీన్‌ పట్నాయక్ కోరారని, దీనికి కేసీఆర్ అంగీకరించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనిపై ప‌ట్నాయ‌క్ ఊహించ‌ని కౌంట‌ర్ ఇచ్చారు.

కాంగ్రెస్ - బీజేపీయేతర భావసారూప్యత కలిగిన పార్టీలను కూడగట్టేందుకు కృషిచేస్తున్న టీఆర్‌ ఎస్ అధినేత.. గత నెలలో కోల్‌ కతా వెళ్లి - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం బెంగళూరు వెళ్లి - జేడీఎస్ అధినేత - మాజీ ప్రధాని హెచ్‌ డీ దేవెగౌడతోనూ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయ కూటమి అవసరాన్ని అటు మమతాబెనర్జీ - ఇటు దేవెగౌడ నొక్కిచెప్పారు. ఇదే రీతిలో తాజాగా ఒడిశా సీఎం ప‌ట్నాయ‌క్‌ తో భేటీ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వెలువ‌డిన ప్ర‌క‌ట‌న‌పై నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఊహించ‌ని రిప్లై ఇచ్చారు. "తెలంగాణ ముఖ్యమంత్రి ఒడిషాలోని పూరీ తీర్థయాత్రకు వస్తున్నారు. దారిలో మర్యాదపూర్వకంగా (నన్ను)కలుసుకునేందుకు వస్తానన్నారు. అపుడు ఫెడరల్ ఫ్రంట్ మీద గాని లేదా రాజకీయాంశాల మీద గాని ఎలాంటి చర్చ ఉండదు.’’ అంటూ ఆయ‌న తేల్చిచెప్పారు. దీంతో సీఎం కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న కామెడీ పాల‌యింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే కేసీఆర్‌ కు ఇలాంటి రెండు ఎదురుదెబ్బ‌లు త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ఫ్రంట్ రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా చేసిన మొద‌టి ప్ర‌య‌త్నంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతు పలికినట్లు తెలంగాణ సిఎం కార్యాలయం ప్రకటించింది. కానీ దీదీ కాల్ చేయలేదని, కేసీఆరే ఆమెకు కాల్ చేశారని టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. ఇక ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ఫోన్ చేసి మద్దతు పలికారని తెలంగాణ సీఎం ఆఫీసు వివ‌రించింది. కానీ తర్వాత రోజే హేమంత్ సోరేన్ రాహుల్ గాంధీతో చేతులు కలిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అనంత‌రం ఆయ‌న‌తో రాష్ట్రంలో ప‌ర్య‌టించేలా చేశారు. ఇదే ప‌ర్వంలో తాజాగా ప‌ట్నాయ‌క్ సైతం కేసీఆర్ టీం చేసిన ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధ‌మైన స్టేట్‌ మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.