Begin typing your search above and press return to search.

ఇప్పుడు కానీ మూసారంబాగ్ బ్రిడ్జి చూస్తే నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:00 PM IST
ఇప్పుడు కానీ మూసారంబాగ్ బ్రిడ్జి చూస్తే నోట మాట రాదంతే
X
మూసారంబాగ్.. అన్నంతనే ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా? అదేనండి.. దిల్ సుఖ్ నగర్ కు ఇవతల పక్క.. అంబర్ పేట నుంచి దిల్ సుఖ్ నగర్.. మలక్ పేటలోకి వెళ్లాలంటే మూసారంబాగ్ బ్రిడ్జిని దాటాల్సిందే. దానికి కాస్త దూరంలో ఇండియన్ ఆయిల్స్ పెట్రోల్ బంక్ ల్యాండ్ మార్కులా గుర్తుకు వస్తుంది. దానికి కాస్త ముందుకు వెళితే ఆర్టీఏ ఆఫీసు ఉంటుంది. నిత్యం వేలాది వాహనాలతో బిజీబిజీగా ఉండే ఆ బ్రిడ్జ్ ను ఇప్పుడు చూస్తే.. నోట మాట రాదంతే.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరం ఆగమాగం కావటం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు.. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 14 గేట్లను నాలుగు అడుగుల ఎత్తుకు లేపారు. దీంతో.. పై నుంచి వస్తున్న వరద నీటితో మూసీ పరవళ్లు తొక్కుతోంది.

నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీనది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూసీ పరవళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. కొన్నిచోట్ల దాని దూకుడు ఆందోళనకు గురి చేస్తోంది. మూసారంబాగ్ వద్దకు వచ్చేసరికి..బ్రిడ్జి మీద దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తుకు మూసీ పరవళ్లు తొక్కుతున్న వైనంతో షాక్ తింటున్నారు. వరద పోటుతో.. అసలు అక్కడో బ్రిడ్జి ఉందన్నదే తెలీని రీతిలో తీస్తున్న పరవళ్లు చూసే వాళ్లందరికి షాకిస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా.. ఈ వరదకు జోరువాన తోడైతే పరిస్థితి ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.