Begin typing your search above and press return to search.

వరంగల్ పరిస్థితిని సమీక్షించేందుకు కేసీఆర్ వెళ్లరెందుకు?

By:  Tupaki Desk   |   18 Aug 2020 12:45 PM IST
వరంగల్ పరిస్థితిని సమీక్షించేందుకు కేసీఆర్ వెళ్లరెందుకు?
X
అనుకోని రీతిలో విపత్తు ఎదురైతే.. పరిస్థితిని స్వయంగా తెలుసుకోవటం కోసం చాలా తక్కువ సందర్భాల్లో దేశ ప్రధాని.. తరచూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా ఏరియల్ సర్వేను చేపడతారు. పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మహా పట్టణం తీవ్ర ప్రభావానికి లోను కావటం తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితిని వరంగల్ వాసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేళ.. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేను నిర్వహిస్తుంటారు.

వరద తీవ్రత శనివారం షురూ అయి.. ఆదివారానికి తీవ్రరూపం దాల్చింది. దీనికి సంబంధించి వివరాలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆదివారం నుంచి అదే పనిగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంత తీవ్రత ఉన్నప్పుడు హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్ని పరిశీలించటం.. ఏమేం చేయాలన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంటారు. విచిత్రంగా వరదపోటు చోటు చేసుకొన్న నాలుగో రోజున కానీ అక్కడి పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు హెలికాఫ్టర్ లో వెళ్లనున్నారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు. పరిస్థితి ఎలా ఉందన్నది సమీక్షించి.. ఏమేం చర్యలు తీసుకోవాలో అధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా ఈ రోజు (మంగళవారం) వరంగల్ కు మంత్రులు కేటీఆర్.. ఈటెల పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో వరంగల్ కు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెళ్లే ఇలాంటి వాటికి మంత్రులు వెళ్లటం దేనికి నిదర్శనం? ఇంతటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రారు? అన్నది ప్రశ్నగా మారింది.