Begin typing your search above and press return to search.

వరంగల్ కు ఏమైంది? ఎందుకలా మునిగిపోయింది?

By:  Tupaki Desk   |   17 Aug 2020 11:00 AM IST
వరంగల్ కు ఏమైంది? ఎందుకలా మునిగిపోయింది?
X
భారీ వర్షం కురిస్తే.. రోడ్లు జలమయం కావటం.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం.. జనజీవనం స్తంభించిపోవటం లాంటివి మామూలే. అందుకు భిన్నంగా ఒక నగరం మొత్తం మునిగిపోవటం.. లోతట్టు ప్రాంతాలు కాని చోట్ల కూడా.. ఇళ్లపైకి ఎక్కి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు లేని రీతిలో వరంగల్ నగరం మొత్తం మునిగిపోయిన వైనం చూసినోళ్లంతా విస్మయానికి గురవుతున్నారు. చారిత్రక నగరిగా పేరున్న ఓరుగల్లు.. తాజాగా నీరుగల్లుగా మారింది. వర్షం నీరు పెద్దగా నిలవని కాలనీల్లోనూ రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరటంతో వరంగల్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నీటిలో చిక్కుకొని సగం దాకా మునిగిన లారీలు.. నిండా మునిగిన కార్లు.. బైకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ఆటోలు.. లాంటి వాహనాల పరిస్థితి మరింత దారుణం. ఇలా వాహనాలు ఒక్కటే కాదు.. కనుచూపు మేర.. నీళ్లు తప్పించి మరింకే కనిపించని ప్రత్యేక సందర్భంగా తాజాగా చోటు చేసుకుందని చెప్పాలి. అన్నింటికి మించి వరంగల్ హంటర్ రోడ్డు లోని గ్రీన్ వుడ్ స్కూల్ జంక్షన్ వద్ద ఎత్తైన భనం నుంచి చూస్తే.. కనుచూపు మేర నీరు.. అందులో తేలుతున్నట్లుగా భవనాలు కనిపించే దారుణ పరిస్థితి. ఇప్పటివరకూ తామెప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడలేదంటున్నారు.
ఎందుకిలా జరిగింది? అన్న ప్రశ్నకు అధికారులే కాదు.. అక్కడి వారు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. జవాబు చెప్పేవారు మాత్రం భారీ వర్షంగా చెబుతున్నారు. వారు చెప్పిన మాటనే పరిగణలోకి తీసుకుందాం. ఎంత వర్షం పడిందంటే.. పాతిక సెంటీమీటర్లా? అంటే అది కూడా కాదు. ఆదివారం ఒక్కరోజులో కురిసిన వర్షం 13.4 సెంటీమీటర్లు. అంతకు ముందు రోజు కూడా ఇంచుమించు అంతే వర్షం.. లేదంటే మరో రెండు మూడు సెంటీమీటర్ల వర్షం పడిందని చెప్పాలి.

ఆ మాత్రంవర్షానికే పెను ఉత్సాతం మాదిరి.. నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉండకూడదు కదా? భారీగా కురిసిన వర్షంతో పాటు.. ఆక్రమకట్టడాలతో మూసుకుపోయిన దారులు.. దీనికి తోడు.. పలుచోట్ల డ్రెయినేజీలు బ్లాక్ కావటం.. వరదనీరు ఎదురుతన్నటంతో పాటు.. విడవకుండా భారీగా కురిసిన వర్షాలతో ఇలాంటి దారుణ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. వర్షాల కారణంగా వరంగల్ చరిత్రలో ఎప్పడూ చూడని రీతిలో.. వరద సహాయక చర్యల్లో భాగంగా పడవల్ని వినియోగించు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే చూస్తున్నట్లు చెబుతున్నారు.

నగరంలోని హంటర్ రోడ్.. సాయి నగర్ కాలనీ.. సంతోషిమాత కాలనీ.. సరస్వతి నగర్.. ములుగు రోడ్డు.. అండర్ రైల్వే గేటు.. దేశాయిపేట.. నజరత్ పురం.. వడ్డెపల్లి.. కేయూ 100 ఫీట్ల రోడ్డుతో సహా మరికొన్ని ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే. డాక్టర్స్ కాలనీ.. కాకతీయ కాలనీ.. ప్రశాంత్ నగర్..రాజాజీ నగర్.. లష్కర్ సింగారం.. గోపాల్ పూర్.. విద్యానగర్.. సమ్మయ్య నగర్.. వాజయ్ పేయ్ నగర్.. ఫారెస్టుకాలనీ.. పోచమ్మకుంట.. ప్రేమ్ నగర్ కాలనీల్లో అయితే.. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. డాబా.. రెండు..మూడు అంతస్తుల్లో నివసించే వారు సైతం.. గ్రౌండ్ ఫ్లోర్ ను వదిలేసి.. పై అంతస్తుల్లో ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఇలాంటి వారిని రక్షించి.. పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలాంటి సీన్లు వరంగల్ చరిత్రలో తొలిసారి అని చెబుతున్నారు.