Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

By:  Tupaki Desk   |   14 Oct 2020 10:30 AM IST
హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
X
కోటి మందికి పైనే ఉండే హైదరాబాద్ మహానగరం భారీ వర్షం కారణంగా ఆగమాగమైంది. అదే పనిగా.. ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా మహానగర జీవి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నగరం మీద వరుణుడు పగబట్టినట్లుగా పరిస్థితి మారటంతో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని సన్నివేశాలు ఎన్నో మహానగరంలో చోటు చేసుకున్నాయి. సోమవారం నుంచి వర్షం జల్లులు కాస్త కురుస్తున్నా.. మంగళవారం ఉదయం నుంచి కొంచెం కొంచెంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి సీన్ కాస్త కాస్త మారుతూ.. సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి పరిస్థితి మొత్తం మారిపోయింది. అదే పనిగా కురిసిన జోరు వానలో వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇంట్లోకి నీళ్లు వచ్చేశాయి. వంట సామాగ్రితో పాటు.. బియ్యం.. పప్పు.. ఉప్పు లాంటి వస్తువులు వాన నీటి పాలయ్యాయి.

ఇదిలా ఉంటే.. వేలాది సెల్లారు అపార్ట్ మెంట్లు వర్షపు నీటిలో చిక్కుకుపోయియి. డ్రైనేజీలు ఓవర్ ప్లో కావటంతో.. వర్షపు నీరు వరద నీరుగా మారి.. కాలనీలకు కాలనీలు జలయమయ్యాయి. లక్కీగా.. మంగళవారం ఉదయం నుంచి పడుతున్న వర్షం కారణంగా అలెర్టు అయిన నగర జీవులు పెద్దగా బయటకు రాలేదు. దీంతో.. ట్రాఫిక్ జాం లాంటివి చోటు చేసుకోలేదు. కాకుంటే.. రోడ్డు మీద వెళుతున్నప్పుడు.. ముందు ఏముందన్న విషయంపై వాహనదారులు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.

రోజు అలవాటైన రహదారులే అయినప్పటికి.. వాహనం మీద వెళ్లాలంటే వణకాల్సిన పరిస్థితి. కారణం.. వర్షనీటి ప్రవాహ తీవ్రత అంత ఎక్కువగా ఉండటమే. నగరంలో ఎక్కువగా ఉండే పాత భవన యజమానులకు మంగళవారం రాత్రి కాళరాత్రిని తలపించింది. దీనికి తోడు.. వర్షపు తీవ్రతతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో..చీకట్లు అలుముకున్నాయి. పలు ప్రాంతాల్లో పాత గోడలు కూలాయి.. విద్యుత్త స్తంభాలు కూలి పోవటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది.

రహదారులు మొత్తం జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిన పరిస్థితి. పలుచోట్ల వరద నీటి తీవ్రతకు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. అవెన్ని అన్న విషయం ఈ రోజు (బుధవారం) కానీ క్లారిటీ రాని పరిస్థితి. హైదరాబాద్ తో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కాకుంటే.. హైదరాబాద్ మహానగరం మరింతగా ఎపెక్టు అయ్యింది.

ఇంతకు ఇంత భారీ వర్షానికి కారణంగా బంగాళాఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండ ప్రభావమని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండటం మంగళవారం మధ్యాహ్నం ఏపీ సరిహద్దును దాటేసినప్పటికి దీని తీవ్రత మాత్రం తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఉందని చెబుతున్నారు. ఈ రోజు (బుధవారం) కూడా వర్షం ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. వాహనదారులు.. మిగిలిన వారు అవసరమైతే తప్పితే పనులు పెట్టుకోకపోవటం మంచిది. ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోవటం ఉత్తమంగా చెబుతున్నారు. బీకేర్ ఫుల్.