Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో నాలుగు రోజుల్లో భారీవర్షాలు .. బొట్లు తెప్పించిన ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:20 PM IST
హైదరాబాద్ లో నాలుగు రోజుల్లో భారీవర్షాలు .. బొట్లు తెప్పించిన ప్రభుత్వం !
X
హైదరాబాద్ నగర వాసులు వర్షం పేరు చెప్తేనే హడలిపోతున్నారు. చినుకు పడితే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. గత వారం భారీ వర్షాలు భాగ్యనగరంలో బీభత్సవం సృష్టించాయి. మొన్నటివరకు ఎంతో సుందరంగా ఉన్న హైదరాబాద్ మహానగరం భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిపోయింది. ఎక్కడిక్కడ రోడ్లు కుంగి భారీ గుంతలు ఏర్పడ్డాయి. అలాగే కొన్ని కొన్ని చోట్ల రోడ్లు వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయాయి. భారీ వర్షాల దెబ్బకి వచ్చిన వరద ప్రవాహం లో కొట్టుకుపోయి చాలామంది మరణించారు. అలాగే వేల సంఖ్యల్లో వాహనాలు పూర్తిగా పాడైపోయాయి. ఇంకా నగరం వరద ముంపు నుండి పూర్తిగా బయటపడింది. కొన్ని కాలనీల్లో ఇంకా వరద నీళ్లు అలాగే ఉన్నాయి. దీనితో జీహెచ్ఎంసి సహాయక చర్యలు చేపడుతుంది.

అయితే, నగరంలో ప్రతి రోజు కూడా భారీ వర్షాలు పడుతుండటంతో వరద ముంపు ప్రాంతాలు ఇంకా ఆ ముంపు నుండి బయట పడలేదు. . ఇలాంటి పరిస్థితిలో మళ్లీ భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముంపు కష్టాలు గ్రేటర్ వాసులను వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ఏడు రోజులుగా వణుకుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ఇళ్లల్లో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి.. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక తడిచిన వాటితోనే చలికి వణుకుతున్నారు. అడుగు బయట అడుగుపెట్టే పరిస్థితి నెలకొంది. కొందరిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది.

ఇదిలా కొనసాగుతున్న నేపథ్యంలోనే హైదరాబాద్ లో మరో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని , వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. వరద సహాయక చర్యల కోసం 50 బోట్లను తెప్పించి పెట్టింది. ఏ సమయంలో ఎక్కడ అవసరం ఉన్నా , అక్కడికి పంపించి వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించనున్నారు. రిజర్వాయర్ల వద్ద ఉన్న బోట్లను ప్రభుత్వం తెప్పించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం 5 బోట్లను పంపించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతి వద్ద ఈ బోట్లను సిద్ధంగా ఉంచారు. వరద వచ్చినా ఈ సారి ఓ ఒక్కరి ప్రాణం కూడా పోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రులు చెప్తున్నారు.