Begin typing your search above and press return to search.

చెన్నై మహానగరం ఎంతగా తడిచిందంటే..?

By:  Tupaki Desk   |   2 Nov 2015 8:06 AM GMT
చెన్నై మహానగరం ఎంతగా తడిచిందంటే..?
X
ఆదివారం.. ఆ పై ముసురు పట్టిన వేళ. ఆహ్లాదంగా ఉన్న వాతావరణంతో.. అప్పుడప్పుడు పలుకరిస్తున్న వర్షంతో చెన్నై వాసులు కాస్తంత ప్రశాంతంగా ఉన్నారు. అయితే.. అదంతా ఆదివారం సాయంత్రం వరకే. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఉరుములు ఉరిమితే.. కుండపోతను తలపించేలా.. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా జోరుగా వాన. ఎంత తీవ్రంగా అంటే.. కేవలం గంటల వ్యవధిలో 69 సెంటీమీటర్ల వర్షంతో చెన్నై మహానగరం తడిచి ముద్దకావటమే కాదు.. వణికిపోయింది.

భారీగా కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటివరకూ సేద తీరేలా చేసిన వర్షమే.. చెన్నై వాసులకు శాపంగా మారింది. సాయంత్రం వరకూ వర్షానికి ఎంజాయ్ చేసిన చెన్నై వాసులు.. సాయంత్రం దాటిన తర్వాత భయంతో వణికిపోయే పరిస్థితి. వీధులన్నీ వర్షంతో నిండిపోవటంతో తటాకాల్ని తలపించేలా చెన్నై మహానగరం మారిపోయింది. భారీ వర్షం కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. ఇక.. కరెంటు తీగలు.. కేబుల్ వైర్లు.. ఇలా చాలాచోట్ల పడిపోవటంతో వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది.

ఇక.. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మొత్తంగా మారిపోయింది. భారీగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. డ్రైన్లు పొంగిపొర్లాయి. చెన్నై మహానగరంతో పాటు.. తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. ఆస్తినష్టంతో పాటు.. ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో వర్షం కారణంగా మృతి చెందినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మరింత రావాల్సి ఉంది. ఊహించని రీతిలో విరుచుకుపడిన భారీ వర్షానికి అతలాకుతలమైన చెన్నై మహానగరంలో పరిస్థితిని మామూలుకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జయలలిత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా.. ఊహించని రీతిలో విరుచుకుపడిన వాన చెన్నై వాసులకు చుక్కలు చూపించింది.