Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఎంత వరస్ట్ పొజిషన్లో ఉందంటే..?

By:  Tupaki Desk   |   21 May 2016 7:56 AM GMT
హైదరాబాద్ ఎంత వరస్ట్ పొజిషన్లో ఉందంటే..?
X
హైదరాబాద్ కు సంబంధించి ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా.. ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రస్తుత అధికార పార్టీ.. అంతకుముందు పాలించిన పార్టీలు పోటీ పడుతుంటాయి. ఇంతకుముందున్నవాళ్లు తాము హైదరాబాద్‌ ను అద్భుతంగా అభివృద్ధి చేశామంటారు. ఇప్పుడున్న తమ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని అంటారు. కానీ మన పేరుగొప్ప హైదరాబాద్ వాస్తవ పరిస్థితేంటన్నది ఓ అరగంట వర్షం పడితే తేటతెల్లం అయిపోతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో జస్ట్ 1.4 సెంటీమీటర్ల వర్షం పడిందంతే.. ఓ అరగంట పాటు ఈదురుగాలులు వీచాయి. ఆమాత్రానికే అంతా అతలాకుతలం అయిపోయింది. డ్రైనేజీ రోడ్ల మీదికి వచ్చి పారింది. ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. నగరం అంధకారంలోకి వెళ్లిపోయింది.

ఓ పద్ధతీ పాడు లేకుండా ఉన్న విద్యుత్ వ్యవస్థ ఈ గాలీ వాన ధాటికి అతలాకుతలం అయిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇలా గాలి వీచగానే అలా పవర్ పోయింది. రాత్రంతా కరెంట్ లేదు. మరుసటి రోజుకు కూడా ఇంకా విద్యుత్ పునరుద్ధరించలేని పరిస్థితి. ఎక్కడికక్కడ చెట్లు.. విద్యుత్ స్తంభాలు.. భారీ హోర్డింగులు కూలిపోయాయి. రేకుల షెడ్లు.. గుడిసెలు.. తాత్కాలిక కట్టడాల పైకప్పులు ఎగిరిపోయాయి. వీళ్ల గురించి పట్టించుకునే నాథుడు లేడు. వర్షపు నీరు పోటెత్తి పలు కాలనీలు - రహదారులు చెరువుల్లా మారాయి.

ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి.. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. సగానికి పైగా నగరంలో అంధకారం నెలకొంది. గాలివాన ధాటికి ముగ్గురు ప్రాణాలు వదలగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా కూడా ఆగిపోవడం గమనార్హం. ప్రకృతి భీభత్సాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఆ భీభత్సం ప్రభావాన్ని నివారించడంలో వ్యవస్థ వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.