Begin typing your search above and press return to search.

ఉరిమిన వరుణుడు.. వణికిన తెలుగు రాష్ట్రాలు

By:  Tupaki Desk   |   6 May 2016 6:57 AM GMT
ఉరిమిన వరుణుడు.. వణికిన తెలుగు రాష్ట్రాలు
X
మంట పుట్టించే ఎండ మాయమైంది. ఎండ తీవ్రతతో విలవిలలాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేద తీరేలా వచ్చిన వర్షం తన తఢాఖా చూపించింది. దీంతో.. ఎండ దెబ్బకు బెదిరిపోయిన తెలుగు ప్రజలు.. హటాత్తుగా కురిసిన కుంభ వర్షానికి వణికిపోయిన పరిస్థితి. హటాత్తుగా కురిసిన భారీ వర్షానికి పెద్ద.. పెద్ద వృక్షాలు సైతం ఒరిగిపోయాయి. ఇక.. కరెంటు స్తంభాలు అయితే చెప్పాల్సిన అవసరంలేదు.

గురువారం సాయంత్రానికి చల్లబడిన వాతావరణం.. రాత్రి వేళలోనూ మామూలుగానే ఉంది. అర్థరాత్రి దాటిన తర్వాత పెనుగాలులు మొదలయ్యాయి. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేలాది కోట్ల ఏసీల్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఎలా ఉంటుందో.. తెలుగు రాష్ట్రాలు రెండూ కూల్ కూల్ గా మారిపోయాయి. వరుణుడి వీరంగంతో అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడిన పరిస్థితి. ప్రతిచోటా వర్షం తాలూకు నష్టం ఎంతోకొంత కనిపించింది. ఊహించని రీతిలో వచ్చి పడ్డ భారీ వర్షంతో మామిడి పంట మీద తీవ్ర ప్రభావం చూపించగా.. పలుచోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి.

అన్ని ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ మహా నగరంలో వర్షం తీవ్రత ఎంతన్నది ప్రతి నగర జీవికి స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. అర్థరాత్రివేళ గాఢ నిద్రలో ఉన్న వేళ.. కిటీకీలు పగిలిపోతాయేమోనంత భారీగా ఈదురుగాలులు మొదలు కావటంతో వణికిపోయే పరిస్థితి. బయట వర్ష తీవ్రత ఎంతన్న విషయాన్ని చూసేందుకు కూడా భయపడేలా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం కురిసిన పరిస్థితి. బలమైన ఈదురుగాలులు మొదలై.. భారీగా వర్షం గంటల కొద్దీ కురయటంతో రోడ్లు అన్ని జలమయ్యమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోగా.. నాలాలకు చిల్లులు పడిన పరిస్థితి.

దీంతో.. పొద్దున్నే నిద్ర లేచిన నగరజీవికి వర్ష తీవ్రత ఎంతన్న విషయం రోడ్డు మీద విరిగిపడిన చెట్లు.. కొట్టుకొచ్చిన మట్టి.. నిలిచిన నీళ్లు చెప్పకనే చెప్పేశాయి. వీటన్నింటికి తోడు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో.. నగర ప్రజల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మొత్తంగా చూస్తే.. నిన్నటివరకూ మండే ఎండలతో భానుడు చెమటలు పట్టిస్తే.. తాజాగా వర్షంతో వరుణుడు వణికించిన పరిస్థితిగా చెప్పొచ్చు.