Begin typing your search above and press return to search.

విప‌త్తు విశ్వ‌రూపానికి కేర‌ళ విల‌విల‌!

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:13 AM GMT
విప‌త్తు విశ్వ‌రూపానికి కేర‌ళ విల‌విల‌!
X
సూరీడు కనిపించ‌టం ఒక వార్తేనా? నో.. అనేస్తారు. కానీ.. కేర‌ళ‌లో ఇప్పుడు అదే పెద్ద వార్త‌. ఎందుకంటే.. ప‌దిహేను రోజులుగా వారు సూరీడు చూసింది లేదు. ఆదివారం కేర‌ళ‌లో సూరీడు క‌నిపించ‌టంతో అక్క‌డి మీడియాలో పెద్ద ఎత్తున సూరీడు క‌నిపించాడ‌న్న వార్త‌ను హెడ్ లైన్స్ లో వేశారు. కేర‌ళ‌లో వర‌ద బీభ‌త్సం ఎంత‌న్న‌ది చెప్ప‌టానికి ఈ ఉదాహ‌ర‌ణ చాలు.

కేర‌ళ‌ను చుట్టుముట్టిన వ‌ర‌ద‌ల కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులు కావ‌టంతో పాటు.. స‌హాయ‌క శిబిరాల్లో త‌ల దాచుకుంటున్నారు. ఇక‌.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు సాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. మ‌రింత జ‌రుగుతున్న‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌ల మాటేమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చూస్తే.. వివ‌రాలు భారీగా క‌నిపిస్తాయి. దాదాపు వంద విమానాలు.. హెలికాఫ్ట‌ర్లు.. రాత్రింబ‌వ‌ళ్లూ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. 500 ప‌డ‌వ‌లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. ఆర్మీ.. నేవీ.. ఎయిర్ ఫోర్స్.. ఎన్టీఆర్ ఎఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే వంద‌లాది మంది స‌హాయ‌క సిబ్బంది స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో బిజిబిజీగా ఉన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. అప‌న్న‌హ‌స్తం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు పెద్ద ఎత్తున ఉన్నారు. తామింత క‌ష్టంలో ఉంటే త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదన్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. విల‌యం విశ్వరూపం కేర‌ళ‌లో క‌నిపించింది. దీంతో.. భారీ ఎత్తున స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా.. అవేమీ ఒక మూల‌కు రాని ప‌రిస్థితి నెల‌కొంది.

భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద పోటు తీవ్ర‌త ఎంతంటే.. ఇళ్ల‌ల్లో న‌డుం లోతు నీళ్ల‌ల్లో బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న కేర‌ళీయులు పెద్ద ఎత్తున ఉన్న‌ట్లు చెబుతున్నారు. తిన‌టానికి తిండి లేక‌.. తాగ‌టానికి నీళ్లు లేక అత్యంత ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితుల్లో వారున్నారు. అళ‌పుఝ జిల్లాలోని చెంగ‌న్నూర్ గ్రామంలో 5వేల మంది చిక్కుకున్నారు. వీరిని ర‌క్షించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నా.. ప్ర‌తికూల ప‌రిస్థితి స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా మారింది.

తీవ్ర క‌ష్టంలో ఉన్నా త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. త‌మ‌కు ఎలాంటి స‌హాయ‌క చ‌ర్య‌లు అంద‌టం లేద‌న్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. స‌హాయ‌క బృందాలు క్ష‌ణం తీరిక లేకుండా ప‌ని చేస్తున్నా.. విప‌త్తు ఊహించ‌టానికి వీల్లేని విధంగా ఉండ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చాలామందికి అంద‌ని దుస్థితి నెల‌కొంది.

కేర‌ళ‌లో వ‌ర‌ద బీభ‌త్సం తీవ్రంగా ఉన్న జిల్లాల్ని చూస్తే.. అళ‌పుఝు.. త్రిసూర్.. ఎర్నాకుళం.. ఇడుక్కి.. ప‌ద‌నందెట్ట తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి.

వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన వారిలోకొంద‌రిని ర‌క్షించే క్ర‌మంలో విషాద ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో క్షేమంగా సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరుకుంటున్నారు. దీంతో తీవ్ర భావోద్వేగాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక అంచ‌నా ప్ర‌కారం.. కేర‌ళ‌లో వ‌ర‌ద‌భాదితుల సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు పైనే ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

కేర‌ళ న‌ష్టాన్ని అంకెల్లో చూస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్రకారం దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు పైనే.. వ‌ర‌ద ప్ర‌భావానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు. వెయ్యికి పైగా ఇళ్లు నేల‌మ‌ట్టం అయితే.. దాదాపు 30 వేల‌కు పైగా ఇళ్లు పాక్షికంగా కుప్ప‌కూలాయి. ఇక‌.. వ‌ర‌ద నీటితో మునిగిన ఇళ్లు ల‌క్ష‌ల్లో ఉన్నాయి. భారీ వ‌ర్షం కారంగా 134 బ్రిడ్జిలు కొట్టుకుపోతే.. 16 వేల కిలోమీట‌ర్ల రోడ్ల ఆన‌వాళ్లు క‌నిపించ‌ని దుస్థితి. వ‌ర‌ద తీవ్ర‌త కార‌ణంగా 9 రైల్వే స‌ర్వీసుల్ని పాక్షికంగా.. 18 స‌ర్వీసుల్ని పూర్తిగా ర‌ద్దు చేసింది. రోడ్లు పూర్తిగా దెబ్బ తిన‌టంతో ఆర్టీసీ.. ప్రైవేటు బ‌స్సులు..కార్లు రోడ్ల మీద‌కు రాలేని ప‌రిస్థితి.

గ‌డిచిన ప‌దిహేను రోజులుగా సాగిన వ‌ర్ష విధ్వంసం నుంచి కేర‌ళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రానున్న నాలుగు రోజుల్లో వ‌ర్షాలు ఉండ‌వ‌న్న అధికార‌ ప్ర‌క‌ట‌న‌తో కేర‌ళీయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. కొజికోడ్‌.. క‌న్నూర్.. ఇదుక్కి జిల్లాల్లో మాత్రం భారీ వ‌ర్షాల ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు.

వ‌ర్ష తీవ్ర‌త త‌గ్గి ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొన‌టంతో స‌హాయ‌క శిబిరాల్లో ఉంటున్న వారు త‌మ ఇళ్ల‌కు తిరిగి వెళ్లి షాక్ తింటున్నారు. ఇల్లు మొత్తం మట్టితోనూ.. బుర‌ద‌తో నిండిపోవ‌టంతో ఈ క‌ష్టాన్ని ఎలా అధిగ‌మించాల‌న్న‌ది వారికో పెద్ద స‌వాలుగా మారింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా అంటువ్యాధులు సోక‌కుండా ఉండేందుకు ప్ర‌తి పంచాయితీకి ఆరుగురు వైద్యాధికారుల్ని పంపిస్తున్నారు. వ‌ర్షాల కార‌ణంగా పుస్త‌కాలు కోల్పోయిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం ఉచితంగా పుస్త‌కాల్ని ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది.

కోచి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం పూర్తిగా నీటిలో మునిగిపోవ‌టంతో ప్ర‌త్యామ్నాయంగా అక్క‌డి నేవీ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాలు న‌డపాల‌ని నిర్ణ‌యించారు. సోమ‌వారం నుంచి కోయంబ‌త్తూరు.. బెంగ‌ళూరుల‌కు విమానాలు న‌డ‌ప‌నున్నారు. త‌క్కువ దూరాల‌కు ఎప్ప‌టి మాదిరే త‌క్కువ ధ‌ర‌ల‌తో విమానాల్ని న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

కేర‌ళ‌కు సాయం కింద పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టారు.

* ఆహార - పౌరసరఫరాల శాఖ 50 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం - గోధుమలను సిద్ధం చేశారు.

* వినియోగదారుల వ్యవహారాల శాఖ సోమవారం 100 మెట్రిక్‌ టన్నుల పప్పులను విమానంలో పంపించనుంది. మరికొంత సరకును రైళ్లలో పంపనుంది.

* పెట్రోలియం శాఖ 9,300 కిలోలీటర్ల కిరోసిన్‌ను సిద్ధం చేసింది. అదనంగా మరో 12 వేల కిలోలీటర్లను ఇవ్వనుంది. కోచిలోని ఎల్‌ పీజీ బాట్లింగ్‌ ప్లాంటును పునః ప్రారంభించింది.

* వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విమానంలో 60 టన్నుల అత్యవసర మందులను పంపించనుంది.

* రైల్వే శాఖ దుప్పట్లు - బెడ్‌ షీట్లను పంపించనుంది.

* సహాయ సామగ్రిని ఉచితంగా రవాణా చేయడానికి ఎయిర్‌ ఇండియా ముందుకువచ్చింది.

* పంజాబ్‌ లోని జలంధర్‌ - పాటియాల నుంచి 100 టన్నుల బిస్కట్లు - రస్కులు - మంచినీరును విమానాల్లో పంపినట్టు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది.