Begin typing your search above and press return to search.

హాట్‌ హాట్‌ గా పాయ‌క‌రావుపేట పాలిటిక్స్.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   27 Sept 2020 6:00 AM IST
హాట్‌ హాట్‌ గా పాయ‌క‌రావుపేట పాలిటిక్స్.. రీజ‌నేంటి?
X
విశాఖ జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావుపేట‌లో వైసీపీ రాజ‌కీయాలు అట్టుడుకుతున్నాయి. ఎమ్మెల్యే క‌న్నా.. కింది స్థాయి నేత‌లే బెట‌ర్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. పైగా స్థానిక ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. మ‌రి ఆ విష‌యాలేంటో చూద్దాం. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, వివాద‌ర‌హితుడు, వైఎస్ కుటుంబానికి చాలా స‌న్నిహితుడిగా పేరున్న గొల్ల బాబూరావు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పాయ‌క‌రావుపేట నుంచి విజ‌యం సాధించారు.

అయితే, ఆయ‌న‌కు ఆర్థికంగా ఆదుకునే విష‌యంలో య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు వంటి వారు సాయం చేశారు. దీంతో స‌హ‌జంగానే విన‌య‌శీలుడు అయిన బాబూ రావు.. త‌న‌కు సాయం చేసిన వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌గానే ఉన్నారు. కానీ.. ఈ ప‌రిస్థితి ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఇబ్బంది తెచ్చిపెట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఎమ్మెల్యేగా బాబూరావు ఉంటే.. ఇక్క‌డి నాలుగు మండ‌లాల్లో కీల‌క నేత‌లుగా ఉన్న న‌లుగురు ఆయ‌న‌కు తెలియ‌కుండా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఎవ‌రికి ఏ ప‌నికావాలన్నా.. స‌హ‌జంగా ఎమ్మెల్యేను సంప్ర‌దించాల్సి ఉండ‌గా.. ఇక్క‌డ మాత్రం రివ‌ర్స్ అవుతోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో పాయకరావుపేట - ఎస్.రాయవరం - నక్కపల్లి - కోటవరట్ల మండ‌లాలు ఉన్నాయి. ఈ నాలుగు చోట్లా న‌లుగురు కీల‌క నాయ‌కులు ఉన్నారు. వీరు ప‌క్క‌నే ఉన్న య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు క‌నుస‌న్న‌ల్లో మెలుగుతున్నార‌నేది వాస్త‌వం. దీంతో ఆయ‌న సూచ‌న‌లు, స‌లహాల‌ను పాటిస్తూ.. ఎమ్మెల్యేను డామినేట్ చేస్తున్నారు. ఎవ‌రు ఏప‌ని కావాల‌న్నా.. ఈ న‌లుగురిలో ఎవ‌రిని క‌లిసినా ప‌ని అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పోనీ.. వీరిని కాద‌ని.. నేరుగా ఎమ్మెల్యే బాబూరావును క‌లిసినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేద‌ని వైసీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్న క‌న్న‌బాబు రాజు.. ప‌రోక్షంగా పాయ‌క‌రావుపేట‌పైనా దృష్టి పెట్టార‌ని.. అక్క‌డ కూడా త‌న ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌ని.. బాబూరావు వ‌ర్గం ఆరోపిస్తోంది. మ‌రి రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అయిన బాబూరావు.. ఇలా వేరొక‌రు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడితే ఊరుకుంటారా? అంటే.. ఊరుకోలేదు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రెండు మాసాలుగా అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉంది. బ‌హుశ ఇది తెలిసే.. క‌న్న‌బాబురాజు త‌న దూకుడును మ‌రింత పెంచి అధిష్టానం ద‌గ్గ‌ర మార్కులు సంపాయించుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల య‌ల‌మంచిలి టీడీపీ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకురావ‌డం వెనుక క‌న్న‌బాబు రాజు ఉన్నార‌నే ప్ర‌చారం ఉంది. మ‌రి ఈ నేప‌థ్యంలో బాబూరావు గోడు ఎప్పుడు ప‌ట్టించుకుంటారో చూడాలి.