Begin typing your search above and press return to search.

ఫ్లైట్ జర్నీలో ప్రయాణికుడికి గుండెపోటు.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   28 May 2022 4:30 AM GMT
ఫ్లైట్ జర్నీలో ప్రయాణికుడికి గుండెపోటు.. తర్వాతేమైందంటే?
X
ఆన్ లైన్ లో పాపులర్ అయిన ఒక యాడ్ అందరిని ఆకర్షిస్తోంది. విమానప్రయాణం చేస్తున్న వేళ ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురి కావటం.. ఎమర్జెన్సీ అంటూ ఎయిర్ హోస్టెస్ అరుస్తూ.. ఫ్లైట్ లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? అనటం.. ఒక మహిళ తన భర్త డాక్టరే అని చెప్పటం.. మారో మాటకు అవకాశం లేకుండా ఎయిర్ హోస్టెస్ అతగాడ్ని లాక్కెళ్లటం.. తీరా చూస్తే తాను డాక్టరే కానీ.. వైద్యం చేసే డాక్టర్ కాదంటూ చెప్పే వైనం కాస్తంత కొత్తగా.. చూసినంతనే ఫన్నీగా అనిపిస్తుంది. నిజంగానే.. ఆ యాడ్ లో మాదిరే ఫ్లైట్ లోని ప్రయాణికుడు అనారోగ్యం బారిన పడితే? సరిగ్గా ఇలాంటి పరిస్థితే తాజాగా చోటు చేసుకుంది. కాకుంటే.. యాడ్ లో మాదిరి కాకుండా.. రియల్ గా జరిగిన సీన్ తెలిస్తే సంతోషానికి గురి కావటమే కాదు.. అందుకు ప్రతిగా సదరు ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించిన తీరునకు వావ్ అనకుండా ఉండలేం.

అసలేం జరిగిందంటే..కన్నూరు నుంచి దుబాయ్ కు యూనస్ చేయాన్ రోత్ అనే ప్రయాణికుడు గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. అతడి అవస్థను గుర్తించిన తోటి ప్రయాణికులు వెంటనే సాయం చేయాలని అడగటం.. ఆ వెంటనే విమాన సిబ్బంది స్పందించటం జరిగిపోయాయి.

అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని.. విమానంలోని వేరే ప్లేస్ కు మార్చారు. అదే సమయంలో విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? అన్న దానికి ప్రతిగా డాక్టర్ షబర్ అహ్మద్ అనే వైద్యుడు ముందుకు వచ్చారు. ఆ వెంటనే తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీసఫిటేషన్) ప్రక్రియను చేపట్టారు.

అదే సమయంలో ఆటోమేటెడ్ ఎక్స్ టర్నరల్ డీఫిబ్రిలేటర్స్ సాయంతో షాకిచ్చి.. సీపీఆర్ విధానంతో అతనికి ప్రాణాపాయాన్ని తప్పించారు. అనంతరం ఆక్సిజన్ సాయంతో అతన్ని కోలుకునే స్థితికి తీసుకొచ్చారు. ప్రయాణికుడి అత్యవసర పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు కాక్ పిట్ లోని వారు తెలుసుకుంటూ ఎయిర్ లైన్స్ సంస్థకు సమాచారాన్ని అందించారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి వైద్యసాయాన్ని సిద్ధం చేశారు.

దుబాయ్ లో విమానం దిగిన వెంటనే వీల్ చైర్ తో సాయానికి సిద్ధం చేశారు. అపత్ కాలంలో అనూహ్యంగా స్పందించిన సిబ్బందికి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడటంతో కీలక పాత్ర పోషించిన వైద్యుడ్ని గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ అభినందించింది.

అక్కడితో ఆగకుండా.. వైద్య సాయం అందించిన వైద్యుడికి.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడికి కాంప్లిమెంటరీగా ఫ్రీ టికెట్లను ఇచ్చింది. దేశీయ.. విదేశీ ప్రయాణాలకు చెల్లుబాటు అయ్యేలా ఆ టికెట్లకు అవకాశాన్ని కల్పించింది. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.