Begin typing your search above and press return to search.

పురాతనం..సురక్షితం..పోషక మయం 'కృష్ణ బియ్యం'

By:  Tupaki Desk   |   8 Sept 2020 9:00 AM IST
పురాతనం..సురక్షితం..పోషక మయం కృష్ణ బియ్యం
X
సాధారణంగా ఏ బియ్యంలో నైనా పరిమితమైన పోషకాలు మాత్రమే ఉంటాయి. కానీ లెక్కలేనన్ని పోషకాలు, ఆరోగ్యం చేకూర్చే బియ్యం మాత్రం 'కృష్ణ బియ్యమే.' అతి పురాతన చరిత్ర ఉన్న ఈ బియ్యం అనేక వ్యాధులకు ఔషధంగా పని చేస్తాయి. ఈ బియ్యాన్ని ఆహారంలో భాగంగా చేర్చితే అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. వ్యాధులకు దూరంగా సురక్షితమైన జీవనం సాగించొచ్చు. అత్యధిక విటమిన్లు, మినరల్స్ ఉండే ఈ బియ్యం ఈశాన్య భారతంలో సాగు చేస్తున్నారు. ఈ బియ్యం ద్వారా రోగ నిరోధక శక్తి, శారీరక బలం వృద్ధి చేకూరుతాయి.

పోషకాలు పుష్కలం

ఈ బియ్యం ఇతర రకాలతో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇందులో బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి. యాంథో సయాన్ అత్యధికంగా ఉన్న ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ఇందులో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు జింక్ ఐరన్ కాపర్, ఫైబర్, కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.యూఎన్ డీఏ ప్రకటించిన వివరాల ప్రకారం 100 గ్రాముల కృష్ణ బియ్యంలో శక్తి - 356 కిలో కేలరీలు, ప్రోటీన్లు 8.8 నుంచి 12.5 గ్రాములు, యాంథో సయన్స్ -69 నుంచి 74 మిల్లీ గ్రాములు, క్యాల్షియం 24.06 మిల్లీ గ్రాములు, లిపిడ్స్ -3.33 గ్రాములు, ఐరన్ -2.4 మిల్లీ గ్రాములు, అమిలోజ్ -8.27 శాతం, మెగ్నీషియం 58.46 మిల్లీ గ్రాములు ఉన్నాయి.

రోగనివారిణి

కృష్ణ బియ్యం ఆహారంలో భాగంగా చేర్చితే ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయని రుజువైంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గి పోతాయి. అతిసార నిరోధానికి ఎంతో ఉపయోగపడుతుంది. మలబద్ధకం తొలగిపోతుంది. మెదడు కాలేయం పని తీరు పెరిగేందుకు తోడ్పడతాయి. గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, క్యాన్సర్ ను నయం చేయడంలో ఈ బియ్యానిది ముఖ్య పాత్ర.

చర్మ వ్యాధులకు ప్రత్యేకం

కృష్ణ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ వ్యాధులు దరిచేరవు. పూర్వీకులు చర్మ రుగ్మతలు తలెత్తినప్పుడల్లా ఆహారంలో కృష్ణ బియ్యాన్ని తీసుకునేవారు. అందుకే ఈ బియ్యానికి శర్మ రోగాల నివారిణి అనే పేరు ఉంది. ఈ బియ్యానికి కృష్ణ శాలి, కృష్ణ వ్రిహి అనే పేర్లు కూడా ఉన్నాయి

యజ్ఞాల బియ్యం

కృష్ణ బియ్యం ఎంతో ప్రాచీనమైన వరి రకం. పూర్వకాలంలో యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో వాడే బియ్యం గా వీటికి పేరుంది. పండుగల సమయంలోనూ ఆనాటి ప్రజలు వీటిని వాడేవారు. ప్రాచీన గ్రంధాలలోనూ ఈ బియ్యం గురించి ప్రస్తావన ఉంది. చరక సంహిత లోనూ ఈ బియ్యం ఔషధ లక్షణాలను వివరించారు.

ఈశాన్య భారతం నుంచి తెలంగాణకు

ఈ రకం బియ్యాన్ని ఈశాన్య భారతంలో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఇటీవలే బియ్యానికి మణిపూర్, ఉత్తరప్రదేశ్, గోరక్ పూర్ ప్రాంతాల్లో 'జీఐ ' ట్యాగ్ లభించింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కాశిం పేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు వేదాల ఆధారంగా ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ విజయవంతం అయ్యారు. కౌటిల్య ప్రస్తుతం తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చదువుతున్నారు. కృషి భారతం అనే సంస్థను స్థాపించి వ్యవసాయంలో పరిశోధనలు సాగిస్తున్నారు.