Begin typing your search above and press return to search.

కేసీఆర్ మనసును ఎట్ల అర్థం చేసుకోవాలె చెప్పే?

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:03 AM GMT
కేసీఆర్ మనసును ఎట్ల అర్థం చేసుకోవాలె చెప్పే?
X
తెలంగాణ అధికారపక్ష నేతలు ఆవేశంతో ఉడికిపోతున్నారు. ఎంత మంచి చేయాలని చూసినా.. తాము చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తూ తమను బద్నాం చేయాలన్న ఆలోచనలో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని.. వారి మాటలకు అమాయకులైన ప్రజలు ట్రాప్ లో పడిపోతున్నారంటూ విపరీతమైన వేదన చెందుతున్నారు.

అలా వేదన చెందే నేతల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఒకరు. ఆ మధ్యన ఎందుకో మూడ్ వచ్చి.. ఉస్మానియా దవాఖానా చూసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పోవటం.. అక్కడ పెచ్చులూడిన గోడల్ని చూసిన ఆయన కదిలిపోయి.. తనదైన శైలిలో వారం రోజుల్లో ఆసుపత్రిని తరలించేస్తాం.. దీన్ని పడగొట్టేసి భారీ భవనాన్ని ఒకటి కట్టేస్తామంటూ ప్రకటన చేసేశారు.

సందులో ఉన్న చిన్న భవనమైతే.. సంబరం చేసుకునే వారేమో. కానీ.. కేసీఆర్ మాటలు అన్నది.. సుమారు 150ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా వైద్యాలయం గురించి. అంత పెద్ద ఆసుపత్రిని.. ఘన చరిత్ర ఉన్న ఉస్మానియాను సింఫుల్ గా కూలగొట్టేస్తామనటం పలువురికి నచ్చలేదు. కూల్చేస్తామనే ఎపిసోడ్ లో కేసీఆర్ చెప్పిన మరో మాట దగ్గరే చాలామంది ఆగిపోయారు.

రిపేర్లు చేయిస్తే.. మరో పదేళ్లు బండి నడవొచ్చని.. అదేమీ లేకుండా కూల్చిపారేసి కొత్తది కట్టుకుంటే ఏమవుతాది అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఇదే పెద్దమనిషి.. మెట్రో నిర్మాణం కారణంగా.. హెరిటేజ్ కట్టడాలకు ముప్పు (?) వాటిల్లితుందంటూ.. సక్కగా కట్టేస్తున్న మెట్రోకు పితకలాటం పెట్టేయటం తెలిసిందే. మెట్రో విషయంలో యాదికొచ్చే చారిత్రంగా మాట.. ఉస్మానియా విషయంలో ఎందుకు గుర్తుకు రావటం లేదన్నది కోటి రూకల ప్రశ్నగా మారిపోయింది.

కేసీఆర్ సాబ్ కు మనసులో వచ్చిందంటే.. దానికి తిరుగు ఉండదని నమ్మే తెలంగాణ అధికారపక్ష నేతలకు.. ఉస్మానియా విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురుకావటం అస్సలు ఇష్టం ఉండటం లేదు. అందుకే తాజాగా వైద్య శాఖా మంత్రి వారు కలుగ జేసుకొని.. కేసీఆర్ మనసు అర్థం చేసుకోండి.. ప్లీజ్ అని బతిమిలాడుతున్నారు.

ఆసుపత్రి గోడల్ని చూసి భయపడటం మానేసి.. రావటమే మానేశారంటూ వ్యాఖ్యానించటమే కాదు.. ఎప్పుడు కూలిపోతుందో తెలీని ఉస్మానియా ఆసుపత్రి భవనాల వల్ల ప్రాణాలు పోకూడదన్న సదుద్ధేశంతోనే కొత్త బిల్డింగ్ లు కట్టించాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. విమర్శల్ని పట్టించుకోకుండా.. ఉస్మానియాలో కొన్ని డిపార్ట్ మెంట్లను మాత్రమే తరలిస్తున్నారని.. మొత్తం తీసి వేస్తారన్నది తూచ్.. ఉత్త మాటే అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఇన్ని మాటలు చెప్పే బదులు.. అత్యవసర రిపేర్లు చేపట్టి.. యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియ ప్రాంగణంలోనే అత్యాధునిక వసతులతో మరో ఆసుపత్రి కట్టించి.. దాన్లోకి షిఫ్ట్ చేస్తే సరిపోయేది కదా. అలాంటి చేతల కంటే కూడా.. వారంతో మార్చేస్తాం.. కూల్చేస్తామని అనటం ఎందుకు.. మళ్లీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించటం ఎందుకు? భయపెట్టి మరీ బుజ్జగించటంలో మజా ఏమిటో తెలంగాణ అధికారపక్షం నేతలకే తెలియాలి.