Begin typing your search above and press return to search.

నోరు జారిన కర్ణాటక రాష్ట్ర మంత్రి.. పిల్లల్ని కనటానికి ఇష్టపడటం లేదట

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:28 PM IST
నోరు జారిన కర్ణాటక రాష్ట్ర మంత్రి.. పిల్లల్ని కనటానికి ఇష్టపడటం లేదట
X
కీలకమైన స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు ఉండే ప్రాధాన్యత.. చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అయితే.. అందుకు భిన్నంగా తరచూ వారు.. తాము బాధ్యతాయుత పదవుల్లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతుంటారు. కర్నాటక రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్ తాజాగా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. భారతీయ మహిళలు పెళ్లి.. పిల్లల్ని కనటానికి ఇష్టపడటం లేదన్న వ్యాఖ్య చేశారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్య.. న్యూరోలాజికల్ సైన్సెస్ లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ పైత్యపు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రోజు నేనీ విషయాన్ని చెబుతున్నందుకు క్షమించండి. ఆధునిక భారత మహిళల్లో చాలామంది ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికి పిల్లలకు జన్మనివ్వటానికి ఇష్టపడరు. వారికి సరోగసీ కావాలి. కాబట్టి మన ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పు మంచిది’’ కాదు అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్ని మహిళా సంఘాలు తప్పు పడుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. మంత్రి చెప్పిన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ.. అందరికి ఆపాదించేలా.. ఒక వర్గానికి చెందిన వారికి పరిమితమయ్యేలా చేయటం సరికాదు. ఈ వ్యాఖ్యతో పాటు మరికొన్నివ్యాఖ్యలు ఆయన చేశారు. అందులో ముఖ్యమైనది.. పిల్లలు తమ తల్లిదండ్రులు తమతో ఉంచుకోవటానికి ఇష్టపడటం లేదని.. దురదృష్టవశాత్తు మనం ప్రాశ్చాత్య మార్గంలో వెళుతున్నామన్నారు. ‘తల్లిదండ్రులు మనతో ఉండటానికి ఇష్టపడటం లేదు. తాతలు మనతో ఉండటం మర్చిపోయాం’ అని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యల్లో కొన్ని వాస్తవాలు ఉన్నా.. మరికొన్ని అవసరానికి మించిననట్లుగా ఉండటం గమనార్హం. ఇలాంటి సున్నిత అంశాల్ని ప్రస్తావించినప్పుడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది.