Begin typing your search above and press return to search.

అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ స్టేజ్ లో మూడు వ్యాక్సిన్లు .. కేంద్రమంత్రి ప్రకటన !

By:  Tupaki Desk   |   21 Sept 2020 11:01 PM IST
అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ స్టేజ్ లో మూడు వ్యాక్సిన్లు .. కేంద్రమంత్రి ప్రకటన !
X
కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ కోసం పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతున్నాయి. భారత్ ‌లోనూ టీకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పార్లమెంటు కు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 145 సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయని , అందులో ఇప్పటి వరకు 35 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయని హర్షవర్ధన్ చెప్పారు. అలాగే దేశంలో వ్యాక్సిన్‌ తయారీకి 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయని, ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తున్నామని తెలిపారు. వాటిలో మూడు అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ స్టేజ్ కి చేరుకున్నాయని తెలిపారు.

అలాగే , మరో నాలుగు వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌ కు చెందిన భారత్‌ బయోటెక్‌, అహ్మదాబాద్ ‌లోని జైడస్‌ క్యాడిలా వంటి సంస్థల పరిశోధకుల కృషిని, వారు సాధిస్తోన్న విజయాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. ఆక్స్ ‌ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెన్ ‌కా టీకా ప్రయోగాలు సీరమ్ ఇన్ ‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలో వైరస్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కరోనా వైరస్ గురించి జనవరి 30న హెచ్చరించింది.. అంతకు ముందే జనవరి 8నే భారత్ కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. జనవరి 17న వైరస్ వ్యాప్తి గురించి ఆరోగ్య సూచనలు జారీచేశామని, జనవరి 30 దేశంలో తొలి కేసు నమోదయ్యిందని డాక్టర్ హర్ష్‌వర్దన్ అన్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 63.7 మిలియన్ల మందికి పరీక్షలు చేశామని, దాదాపు ప్రపంచంలో ఇదే అధికమని తెలిపారు.

దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 86,961 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,87,581కు చేరింది.గ‌త 24 గంట‌ల సమయంలో 1,130 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 87,882కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 43,96,399 మంది కోలుకున్నారు. 10,03,299 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.