Begin typing your search above and press return to search.

మీ హెల్త్ కి.. మీ పని గంటలకూ లింకు?

By:  Tupaki Desk   |   4 Feb 2017 5:30 PM GMT
మీ హెల్త్ కి.. మీ పని గంటలకూ లింకు?
X
రోజులు మారిపోతున్నాయి. అందుకు తగ్గట్లే పరిస్థితులు మారిపోతున్నాయి. కష్టపడి పని చేసే వాడికి గతంలో పరిమితులు ఉండేవి కావు. కాని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తినే తిండి దగ్గర నుంచి తాగే వాటి వరకూ అన్నింటిలోనూ మార్పులు వచ్చేసిన నేపథ్యంలో.. చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా మొత్తానికే మోసం వచ్చేసే పరిస్థితి.

మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారో? అన్న విషయం మీదనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటూ కొత్త లెక్కల్ని చెబుతున్నారు ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు. వారం వ్యవధిలో ఎన్ని పని గంటలు పని చేయాలన్న విషయం మీదన వారు కొత్త లెక్కల్ని చెప్పటమేకాదు.. తమ మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వారం వ్యవధిలో పని చేసే గంటలకూ.. మనిషి ఆరోగ్యానికి లింకు ఉంటుందని చెబుతున్నారు. గతంలో వేసిన లెక్కల ప్రకారం వారంలో 48 గంటలు పని చేసినా ఇబ్బంది ఉండదని చెప్పే వారని.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడా లెక్కలు మారిపోయినట్లుగా వెల్లడించారు. తాజా లెక్కల ప్రకారం వారంలో 39 గంటలకు మించి పని చేసిన పక్షంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న మాటను చెప్పారు.

వారానికి 39 గంటల కంటే ఎక్కువగా పని చేస్తే వివిధ రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మారిన పరిస్థితులకుతగ్గట్లుగా పురుషులు 39 గంటలు.. మహిళలు 34 గంటలు మాత్రమే పని చేయాలని వారు చెబుతున్నారు. సో.. ఈ లెక్కల సంగతిని పరిగణలోకి తీసుకొని.. కాస్త.. ఆరోగ్యం మీద దృష్టి సారిస్తే మంచిది. లేదంటే.. బండి నడిచినన్నాళ్లు బాగానే ఉన్నా.. ఒక్కసారి తేడా వస్తే మాత్రం మొత్తానికి ఇబ్బందేనన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని చెప్పక తప్పదు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/