Begin typing your search above and press return to search.

చిన్న కట్ట కొత్తిమేరలో ‘కత్తి’ లాంటి లక్షణాలెన్నో.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   8 March 2021 12:30 PM GMT
చిన్న కట్ట కొత్తిమేరలో ‘కత్తి’ లాంటి లక్షణాలెన్నో.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?
X
కూర ఏదైనా సరే.. అంతా రెఢీ అయ్యాక.. కొత్తిమీర కట్టలోని కొన్ని ఆకుల్ని తుంచి.. పైపైన వేసే అలవాటు ఉంటుంది. ఆ మాత్రం దానికే కమ్మటి సువాసన ఇవ్వటమే కాదు.. రుచిని రెట్టింపు చేసే దీనిలో ఉన్న కొత్త గుణాల గురించి తాజాగా జయశంకర్ వర్సిటీ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. కొత్తిమేర వేస్తే వచ్చే సువాసన వేరే.. అంటూ లొట్టలేసుకుంటే చెప్పే మాటలకు అదనంగా ఆరోగ్యం కూడా మస్తుగా ఇస్తుందన్న మాటను యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

చిన్న కొత్తిమీర కట్టలో ఉండే సుగుణాల గురించి జయశంకర్ వర్సిటీ పరిశోధకులు సరికొత్త విషయాల్ని చెబుతున్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాజెక్టులో భాగంగా ఆహార నాణ్యత ప్రయోగశాలలో ప్రతి ఆహార పంటలోని పోషక విలువలపై నివేదికను తయారు చేస్తున్నారు.

ఇందులో భాగంగా కొత్తిమీర మీద పరిశోధనల్ని చేపట్టారు. దీన్నినిత్యం ఆహారంలో వాడటం వల్ల శరీరానికి పోషకాలే కాదు.. పలు రోగాల్ని ఇది నియంత్రిస్తుందని తేల్చారు. కొత్తిమీరలో మాంగనీస్.. మెగ్నీషియం.. ఇనుము.. కాల్షియం శరీరానికి అందుతాయని.. ఇందులో లభించే విటమిన్ కె.. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు.. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టటానికి ఉపయోగపడుతుందని తేల్చారు.

అంతేకాదు.. అర్థరైటిస్ వంటి వ్యాధులకు విరుగుడుగా కూడా పని చేస్తుందని గుర్తించారు.కాలేయాన్ని మెరుగుపర్చటంతో పాటు.. అతిసారాన్ని నివారిస్తుందని.. విటమిన్ ఏ.. సీ శరీరానికి అందించటంతో పాటు ఎండోక్రైన్ గ్రంధుల్లో ఇన్సులిన్ స్రావం పెంచటం.. రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించటం లాంటి ఎన్నో ప్రయోజనాలు కొత్తిమేర కట్టలో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఆకుల్లో కొవ్వు ఉండదని.. పీచుపదార్థం ఎక్కువగా తేల్చారు. నోట్లోనూ.. నాలికపైనా వచ్చే పూతలను నయం చేసే యాంటీ సెప్టిక్ లక్షణాలు ఈ ఆకుల సొంతమని తేల్చారు. కట్ట చిన్నదే కానీ.. దీనికున్న శక్తి మాత్రం అమితమైనదని చెప్పక తప్పదు. సో.. కొత్తిమీర కట్టల్ని మరిన్ని తెచ్చుకొని వంటల్లో దాని మోతాదు పెంచటం మంచిదేమో కదూ?