Begin typing your search above and press return to search.

అమ్మ‌కు గుడి కోసం ఉద్యోగాన్ని వ‌దిలేశాడు

By:  Tupaki Desk   |   9 Dec 2016 10:32 PM IST
అమ్మ‌కు గుడి కోసం ఉద్యోగాన్ని వ‌దిలేశాడు
X
త‌మిళ‌నాడులో అభిమానం ఏ విధమైన ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌నేందుకు చెందుతుంద‌నేందుకు ఇదే నిదర్శ‌నం. త‌మిళ‌నాడుకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌గా ప‌నిచేసే వేల్‌మురుగన్ జ‌య‌ల‌లిత‌కు వీరాభిమాని. అమ్మ‌ను ఓ దేవ‌త‌లా ఆరాధించాడు. ఇప్పుడు ఆమె చ‌నిపోవ‌డంతో అత‌ని మ‌న‌సు విక‌ల‌మైంది. ఎలాగూ అమ్మ వెళ్లిపోయింది.. క‌నీసం ఆమెకు ఓ గుడి క‌ట్టి త‌న అభిమానాన్ని చాటాల‌నుకున్నాడు. వెంట‌నే త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాడు!

థేని జిల్లాలోని ఒడ‌ప‌ట్టి పోలీస్ స్టేష‌న్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ప‌నిచేసే వేల్‌మురుగన్‌.. జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో ఉన్న‌పుడు కాశీకి వెళ్లి ఆమె క్షేమం కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేయించాడు. కానీ దేవుడు త‌న ప్రార్థ‌న‌ను విన‌లేద‌ని, తాను చెన్నైకి తిరిగి వ‌చ్చిన రోజే ఆమె క‌న్నుమూశార‌ని వేల్‌మురుగ‌న్ వాపోయాడు. అత‌ని తండ్రి రామ‌య్య ఎంజీఆర్ ఇంటికి వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందిగా ప‌నిచేసేవాడు. ఆ త‌ర్వాత వేల్‌మురుగ‌న్ కూడా హెడ్‌కానిస్టేబుల్ అయ్యాడు. 1999 నుంచి 2002 వ‌ర‌కు జ‌య‌ల‌లిత ఇంటి ద‌గ్గ‌ర సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేశాడత‌డు. "నా కాలేజీ రోజుల నుంచే ఆమె నాకు ఆరాధ్య దైవం. నా అదృష్ట‌వ‌శాత్తు ఆమె ఇంటి ద‌గ్గ‌రే సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేసే అవ‌కాశం రావడం ఒక‌ర‌కంగా క‌ల నిజ‌మైన‌ట్లే. ప్ర‌తిరోజు ఆమె బ‌య‌ట‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఆమె న‌వ్వు కోసం ఎదురుచూసేవాడిని"అని వేల్‌మురుగ‌న్ చెప్పాడు. అత‌నిపై ఆధార‌ప‌డి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా.. ఉద్యోగానికి రాజీనామా చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌లేదు. ఏఐఏడీఎంకే పార్టీ ఏమ‌వుతుంద‌న్న‌ది త‌న‌కు సంబంధం లేద‌ని, త‌న‌వ‌ర‌కు అమ్మే ఆ పార్టీ అని వేల్‌మురుగ‌న్ చెప్పాడు. ఆమెకు గుడి క‌ట్టించాల‌న్న ఉద్దేశంతోనే ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టాన‌ని తెలిపాడు. జ‌య‌ల‌లిత పుట్టిన‌రోజు అయిన ఫిబ్ర‌వ‌రి 24న సీఎం ప‌న్నీర్‌సెల్వం చేతుల మీదుగా గుడిని ప్రారంభించాల‌ని వేల్‌మురుగ‌న్ భావిస్తున్నాడు.

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే ఈ వేల్‌మురుగ‌న్ పేరు మీద 14 గిన్నిస్ రికార్డులు ఉండ‌టం. ఒంటికాలిపై 81 గంట‌లు నిల‌బ‌డ‌టం, పెరియార్ న‌దిలో 157 కిలోమీట‌ర్లు ఈత‌కొట్ట‌డం, 81 అడుగుల ఎత్తు నుంచి కేవ‌లం నాలుగు అడుగుల లోతు ఉన్న వాట‌ర్ ట్యాంక్‌లో దూక‌డంలాంటి రికార్డులు అత‌ని పేరు మీద ఉన్నాయి. ఈ రికార్డుల‌న్నింటిక‌న్నా.. తాను సీఎం చేతుల మీదుగా అందుకున్న అవార్డులే త‌న‌కు సంతోషాన్ని ఇచ్చాయ‌ని వేల్‌మురుగ‌న్ అంటున్నాడు. 2004లో త‌మిళ‌నాడు వ్యాప్తంగా 81 రోజుల పాటు 3600 కిలోమీట‌ర్లు ప‌రుగెత్తినందుకుగాను రూ.3 ల‌క్ష‌ల రివార్డు రాగా.. వాటిని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశాడు.