Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో తనను తానే అమ్మకానికి పెట్టుకున్నాడు

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:00 PM IST
ఫేస్ బుక్ లో తనను తానే అమ్మకానికి పెట్టుకున్నాడు
X
గతంలో మాదిరి ఇప్పుడు పరిస్థితి లేదన్న మాట చాలామంది మగాళ్ల నోటి నుంచి వినిపిస్తోంది. ఒక అమ్మాయి మనసు దోచుకోవటానికి.. ఆమె చేత ఓకే చేయించుకోవటానికి చాలానే కష్టపడాల్సి వస్తుందన్న మాట అబ్బాయిల నోట తరచూ వినిపిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రాశ్చాత్య దేశాల్లోనూ ఉందంటున్నారు. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పక తప్పదు.

బ్రిటన్ లోని ఒక యువకుడు చేసిన పని సంచనలంగా మారింది. ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాలని ప్రయత్నం చేసి.. చేసి విసిగిపోయిన అతడు.. చివరకు సోషల్ మీడియాలో దిగ్గజమైన ఫేస్ బుక్ లో తనను తాను అమ్మకానికి పెట్టుకుంటూ క్లాసిఫైడ్ లో ఒక ప్రకటన ఇచ్చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ యువకుడు ఎవరు? అతగాడి కథేమిటి? అన్నది చూస్తే..

బ్రిటన్ లోని నార్తాంప్టన్ షైర్ కు చెందిన అలెన్ క్లేటన్ అనే 30 ఏళ్ల యువకుడికి ఒక అందమైన అమ్మాయితో జోడీ కట్టాలని భావించాడు. ఇందుకు చాలానే ప్రయత్నాలు చేశాడు. కానీ.. వర్క్ వుట్ కాలేదు. లారీ డ్రైవర్ గా పని చేసే అతడు.. పదేళ్లుగా ప్రియురాలి కోసం చాలానే ప్రయత్నించాడు. చివరకు డేటింగ్ యాప్ లలోనూ విపరీతంగా వెతికాడు. అయినా.. అతనికి కలిసిరాలేదు. ఏ అమ్మాయి నుంచి అతను ఆశించినట్లుగా ప్రపోజల్ రాలేదు.

దీంతో విసిగిపోయిన అతడు.. తాజాగా ఫేస్ బుక్ క్లాసిఫైడ్ లో తనను తాను అమ్ముకోవటానికి సిద్ధమైనట్లుగా పేర్కొంటూ ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చాడు. అందులో ఏముందంటే.. ‘‘నా పేరు అలెన్. వయసు 30 ఏళ్లు. అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నా. రాబోయే రోజుల్లో చాలా పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉంది. ఒంటరిగా కాకుండా జంటగా వెళ్లాలనుకుంటున్నా. డేటింగ్ సైట్లలో జోడి కోసం చాలానే ప్రయత్నాలు చేశా. కాలం కలిసి రాలేదు. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నా’’ అంటూ ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

ఈ ప్రకటన చాలామంది కంట్లో పడింది. ప్రచార మాధ్యమాల్లోనూ వైరల్ గా మారింది. తన కొడుకు ఇచ్చిన ప్రకటన గురించి తెలిసిన అలెన్ తండ్రి ఆశ్చర్యానికి గురైనా.. వెల్ కం చేశాడు. తన కొడుకు మంచోడని.. ఏం చేయమన్నా చేస్తాడని.. మంచిగా వంట చేయటమే కాదు.. ఆ గిన్నెల్ని శుభ్రంగా కడిగేస్తాడని పేర్కొన్నారు. అలెన్ ప్రకటన సంగతేమో కానీ.. అతగాడి తండ్రి ఇచ్చిన కితాబుతో ఎవరో ఒక అమ్మాయి ఓకే చెప్పేయటం ఖాయమంటున్నారు. మరి.. అలెన్ సుడి ఎలా ఉందో చూడాలి.