Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు ఇతడే .. 53 ఏళ్ల క్రితం పోయిన పర్సు దొరికింది !

By:  Tupaki Desk   |   15 Feb 2021 6:11 PM IST
ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు ఇతడే .. 53 ఏళ్ల క్రితం పోయిన పర్సు దొరికింది !
X
జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఎదో ఒక వస్తువును పోగొట్టుకుంటారు. కొన్ని మతిమరుపు వల్ల పోతే.. మరికొన్ని దొంగతనానికి గురవ్వుతాయి. ఇంకొన్ని నిర్లక్ష్యం వల్ల పోతుంటాయి. మరి, అలా పోయిన వస్తువులు మళ్లీ లభిస్తే ... చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అయితే, ఆ వస్తువులు వెంటనే లభిస్తే పెద్దగా పట్టించుకోరు. హమ్మయ్య.. దొరికేసిందని అనుకుంటారు. కానీ, అదే వస్తువు దాదాపు ఐదు వసంతాల తర్వాల లభిస్తే , షాకవుతారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన 91 ఏళ్ల పౌల్ గ్రిశామ్ రిటైర్డ్ నౌకా వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. పౌల్ గ్రిశామ్ అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. 13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకోగానే ఆయన తన పర్సు ఎక్కడో పోగొట్టుకున్నానని గ్రహించాడు.

దానిలో విలువైన పత్రాలు ఉండటంతో ఎంతగానో వెతికాడు. అయినా, లాభం లేకుండా పోయింది. ఆ పర్సులో గ్రిశామ్ నేవీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆయన ముద్దుగా ది ఐస్ అని పిలుచుకునే ఎన్నో ప్రశంసా పత్రాలు ఉన్నాయి. అణు, జీవ రసాయన దాడులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, టాక్స్ స్టేట్మెంట్ వంటి విలువైన డాక్యుమెంట్స్ ఆ పర్సులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, 2014లో అంటార్కిటికాలోని రాస్ ఐల్యాండ్లో ఉన్న మెక్ ముర్డో స్టేషన్ లో ఉన్న పాత భవనాలను కూల్చివేశారు. గ్రిశామ్ పోగొట్టుకున్న పర్సు, దానితో పాటు మరో వ్యక్తికి చెందిన ఓ బిల్ ఫోల్డ్ ఈ కూల్చివేతల్లో భాగంగా దొరికాయి. ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ సహకారంతో స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ ఎంతో శ్రమించి గ్రీశామ్ చిరునామాను సంపాదించగలిగారు.

ఈ పర్సును పోస్టు ద్వారా పంపించారు. మోక్ కీ, డెకాటొ, లిండ్ బర్గ్ గ్రిశామ్ ఆచూకీ కోసం ఎంతో శ్రమించారు. ఎన్నెన్నో గ్రూపులను ఆరా తీశారు. చివరగా నేవల్ వెదర్ సర్వీస్ అసోసియేషన్ను ఆశ్రయించారు. గ్రిశామ్ ఈ అసోసియేషన్లో సభ్యుడు కావడంతో సులభంగా ఆయన వద్దకు దీన్ని పంపించారు. 53 ఏళ్ల తర్వాత తన పర్సును తన వద్దకు చేర్చడంలో జరిగిన ప్రయత్నాలు అద్భుతమని గ్రిశామ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి, మనదైన వస్తువు ఎన్నేళ్లయినా మన దగ్గరికే వస్తుందని గ్రీషమ్ విషయంలో రుజువైంది.