Begin typing your search above and press return to search.

అక్కడ ఆయనే ఎవరెస్ట్ శిఖరం...?

By:  Tupaki Desk   |   30 Jan 2022 8:00 AM IST
అక్కడ ఆయనే ఎవరెస్ట్ శిఖరం...?
X
కొన్ని సార్లు కొందరికి అవకాశం అలా కలసివస్తుంది. జిల్లాల విభజన కాదు కానీ విశాఖ ఏజెన్సీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మంచి రోజులు రానున్నాయి అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పనిచేసి 1989లో అప్పటి చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల‌లో చింతపల్లి పాడేరుగా మారితే రెండవమారు గెలిచారు. ఆ తడవ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఏజెన్సీలో పట్టున్న నేత అయినా ఆయనకు లక్ కలసిరాలేదు. 2019 ఎన్నికలలో ఆయన జనసేన తరఫున పాడేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. అన్నీ అనుకూలిస్తే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను గానీ తన కుమార్తె కానీ పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాల విభజన జరుగుతోంది.

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారమరాజు జిల్లాను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఈ కొత్త జిల్లాలో పాడేరు, అరకు, రంప చోడవరం నియోజకవర్గాలు ఉంటాయి. ఈ మూడింటిలో సీనియర్ మోస్ట్ లీడర్లు ఏ పార్టీలో లేరు. వైసీపీలో చూసుకుంటే కురు వృద్ధుడిగా పసుపులేటి బాలరాజు మాత్రమే ఉన్నారు అనుకోవాలి. ఆయన ఇక అల్లూరి జిల్లాలో చక్రం తిప్పడం ఖాయమని అంటున్నారు.

పాడేరు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రాజకీయ కుటుంబానికి చెందినా రాజకీయంగా అనుభవం తక్కువ. ఇక అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిదీ అదే కధ. ఆమె తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినా ఆమె మాత్రం పాలిటిక్స్ కి కొత్త. ఇక అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ సైతం ఫస్ట్ టైమ్ గెలిచారు. రాజకీయాలకు కొత్త. ఇక టీడీపీలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే సీనియర్ గా కనిపిస్తారు.

ఆ పార్టీలో మాజీ మంత్రి మణికుమారి రాజకీయ జోరు పూర్తిగా తగ్గించేశారు. మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు అబ్రహం యువనేతగా ఉన్నారు. ఇక వైసీపీలో ఎస్టీ కమిషన్ చైర్ ప‌ర్సన్ కుంభా రవి లాంటి వారు దూకుడు చేయవచ్చు. మొత్తానికి చూసుకుంటే గట్టిగా నిలబడితే రాజకీయ అవకాశాలు ఈ మాజీ మంత్రి కుటుంబానికి దక్కే వీలుంది.

అందుకే ఆయన చాలా కాలం తరువాత సౌండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ కి ఆయన ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తామని కూడా చెబుతున్నారు. మరి కాంగ్రెస్ హయాంలో విశాఖ జిల్లా మంత్రిగా ఉన్నా అప్పట్లో మరో మంత్రి గంటా శ్రీనివాసరావు దూకుడుని తట్టుకోలేక ఇబ్బంది పడిన పసుపులేటికి ఇపుడు సోలోగానే స్టీరింగ్ తిప్పే చాన్స్ అయితే వచ్చేసింది అంటున్నారు.