Begin typing your search above and press return to search.

అతడు హగ్ చేసుకున్నాడు.. ఆమె ఎముకలు విరిగాయి.. కోర్టు ఏమంది?

By:  Tupaki Desk   |   18 Aug 2022 12:00 PM IST
అతడు హగ్ చేసుకున్నాడు.. ఆమె ఎముకలు విరిగాయి.. కోర్టు ఏమంది?
X
వినేందుకే విచిత్రంగా ఉన్న ఈ ఉదంతం నిజంగా అంటే నిజంగా చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఈ ఘటన కోర్టు వరకు వెళ్లటమే కాదు.. సదరు అంశంపై న్యాయస్థానం తీర్పును కూడా ఇచ్చేసింది. షాకింగ్ గా అనిపించే ఈ ఉదంతంలోని వెళితే డ్రాగన్ దేశంలోని యుయాంగ్ అనే సిటీలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఒక మహిళను ఆమె కొలీగ్ ఒకరు ఆమెను హగ్ చేసుకున్నారు. అయితే.. ఇది సాదాసీదా హగ్ కాకుండా గట్టిగా చేసుకున్న అతగాడి కౌగిలింతతో ఆమెకు ఊపిరి ఆడని పరిస్థితి. దీనికి తోడు ఛాతీ భాగంలో నొప్పి కూడా కలిగింది. గట్టిగా కేకలు వేయటంతో.. అతగాడు ఆమెను తన 'బిగి' కౌగిలి నుంచి ఆమెను వదిలేశాడు.

అతను వదిలిని తర్వాత కూడా ఛాతీ భాగంలోనొప్పిగా ఉండటంతో.. ఆయిల్ మసాజ్ చేసుకొని ఉపశమనం కోసం ప్రయత్నించింది. అయినప్పటికీ అంతగా రిలాక్స్ కాలేదు. ఇదిలా ఉంటే.. అతగాడు హగ్ చేసుకున్న ఐదు రోజులకు ఆమెకు ఛాతీలో మరింత నొప్పి ఎక్కువ కావటంతో ఆమె ఆసుపత్రికి వెళ్లింది.

ఆమెకు పరీక్షలు జరిపి.. ఎక్స్ రే తీయించారు. అందులో బయటకొచ్చిన వైనం మరింత షాకింగ్ గా మారింది. అదేమంటే.. సదరు మహిళ ఎక్సరేలో మూడు పక్కటెముకలు విరిగినట్లుగా గుర్తించారు. కుడివైపు పక్కటెముకులు రెండు.. ఎడమవైపు ఒకటి విరిగినట్లుగా తేలింది.

దీంతో.. ఇదంతా సహోద్యోగి చేసుకున్న టైట్ హగ్ తో అనే అన్న విషయాన్ని గుర్తించి.. అతడికి తనకు ఎదురైన సమస్యల గురించి చెప్పింది. ఆసుపత్రిలో తనకు చాలా ఖర్చుతోపాటు.. ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వచ్చిందని చెప్పింది. అయితే.. ఆమె మాటల్ని అతను లైట్ గా తీసుకోవటమే కాదు.. తాను హగ్ చేసుకోవటం వల్లనే ఇదంతా జరిగినట్లుగా రుజువేంటని ప్రశ్నించి.. ఇష్యూను తేలిగ్గా తీసుకున్నాడు.

దీంతో ఒళ్లు మండిన ఆమె.. అతగాడు చేసిన పనికి ఆమె కోర్టుకు ఎక్కింది. హగ్ తాలుకు తనకు జరిగిన ఆరోగ్య సమస్యలు ఒకవైపు.. ఒంట్లో బాగోని కారణంగా ఆఫీసుకు వెళ్లకపోవటం లాంటివి చోటు చేసుకున్న విషయాల్ని కోర్టులో ఏకరువు పెట్టుకుంది. తనకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించేలా చేయాలని కోర్టును కోరింది.ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఆమె పక్కటెముకలు విరిగిపోవడానికి హగ్ తప్పించి.. మరింకేమీ చేయలేదన్న విషయాన్ని గుర్తించిన కోర్టు..

సదరు వ్యక్తికి రూ.1.16 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆమెకు మరే కారణంగానూ పక్కటెముకలు విరిగే అవకాశం లేదని తేల్చింది. ఈ వాదన తప్పు అనటానికి సంబంధించిన రుజువులు లేనందున.. సదరు వ్యక్తి పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.