Begin typing your search above and press return to search.

సంకట పరిస్థితుల్లో 'సంకీర్ణం'

By:  Tupaki Desk   |   31 May 2019 6:07 AM GMT
సంకట పరిస్థితుల్లో సంకీర్ణం
X
కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలో అసంతృప్తిగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆరంభం నుంచి అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాల నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో నిత్యం గందరగోళం ఏర్పడింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంపై సొంత పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈమేరకు బీజేపీ నేతృత్వంలో 'ఆపరేషన్‌ కమల్'’ పలుమార్లు నిర్వహించారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం నుంచి ఆరుసార్లు ఆపరేషన్‌ కమల్‌ నిర్వహించిన కమలనాథులు ప్రతిసారీ విఫలమయ్యారు. అయితే లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది కాలంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊరించి.. ఊరించి వెనక్కి తగ్గింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంలో సార్వత్రికం ముగిసే వరకు మౌనం వహించారు. కాగా ప్రస్తుతం సార్వత్రిక సమరం ముగియడం.. కేంద్రంతో పాటు కర్ణాటకలో కూడా బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో మళ్లీ అలజడి మొదలైంది. వెంటనే కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అవలోకన సమావేశాలు నిర్వహించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి వాపోయినట్లు కూడా సమాచారం. అయితే బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్తే మనుగడ కష్టసాధ్యమని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడకు కొత్త వ్యూహాలు రచిస్తోంది.

కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సాగడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి.. అందరు ఒకేతాటిపై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేయొద్దని.. వారి మధ్య విభేదాలే ప్రభుత్వానికి కారణం అవుతాయని సూచించారు. అయితే బీజేపీ వ్యూహానికి భిన్నంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రతివ్యూహం రచించారు. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తారని ప్రచారం సాగినా.. కేవలం చించోళి ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ మాత్రమే వెళ్లారు. అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గురించి జేడీఎస్‌ తో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సీఎం కుమారస్వామికి ధైర్యం చెప్పారు.

సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రి సీఎస్‌ శివళ్లి మరణించడంతో ఆ స్థానం ప్రస్తుతం ఖాళీ ఉంది. ఈ క్రమంలో శివళ్లి స్థానాన్ని కేబినెట్‌ లో ఆర్‌.శంకర్‌ ను భర్తీ చేస్తామని సిద్ధరామయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎస్‌ శివళ్లి కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ క్రమంలో ఆర్‌.శంకర్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి తోడు మైత్రి ఒప్పందంలో భాగంగా జేడీఎస్‌ తరఫున మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఈ మూడు స్థానాలను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

సంకీర్ణ ప్రభుత్వంలో నెలకొన్న పంచాయితీ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈమేరకు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య రాహుల్‌ గాంధీతో భేటీ అయి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. సీఎం కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగించాలని రాహుల్‌ సూచించారు. అదేవిధంగా సీఎం కుమారస్వామి కూడా రాహుల్‌ గాంధీతో ప్రభుత్వం మనుగడ గురించి చర్చించారు.