Begin typing your search above and press return to search.

8వ తరగతి చదివిన వ్యక్తికి విద్యాశాఖ ఇస్తే తప్పేంటి?

By:  Tupaki Desk   |   10 Jun 2018 9:38 AM GMT
8వ తరగతి చదివిన వ్యక్తికి విద్యాశాఖ ఇస్తే తప్పేంటి?
X
క‌ర్ణాట‌క రాజ‌కీయాలు మ‌రోమారు క్రేజీగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డం - సీనియ‌ర్ల‌కు నిరాశ వంటి ప‌రిణామాల‌తో క‌ర్ణాట‌క స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే..దానికి తోడుగా మంత్రి పదవుల కేటాయింపులో జ‌రిగిన ప‌రిణామాలు ఈ వివాదాన్ని మ‌రింత హాట్‌ హాట్‌ గా మార్చుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి స్థానం నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరొంచిన జేడీఎస్ నేత జీటీ దేవెగౌడను కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి తన క్యాబినెట్‌ లోకి తీసుకున్నారు. శాఖల కేటాయింపుల్లో భాగంగా జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖను అప్పగించారు. అయితే జీటీ దేవేగౌడ కేవలం ఎనిమిదో తరగతి మాత్ర‌మే చ‌ద‌వ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఎనిమిదో తరగతి చదివిన బీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖ ఎలా కేటాయించారని శనివారం మీడియా ప్రశ్నించినప్పుడు కర్ణాటక సీఎం హెచ్‌ డీ కుమారస్వామి స్పందిస్తూ దాంట్లో తప్పేముందన్నారు. బీఎస్సీ చదివిన తాను సీఎంగా పని చేస్తున్నానని - 8వ త‌ర‌గ‌తి చదివిన వ్యక్తికి ఉన్నత విద్యాశాఖను అప్పగించడంలో తప్పేమీ లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. మ‌రోవైపు త‌న‌కు శాఖ కేటాయింపుపై జీటీ దేవెగౌడ సైతం క‌లత చెందడం గ‌మ‌నార్హం. తాను మంత్రిగా పని చేయడానికి ఉన్నత విద్యాశాఖ కంటే చిన్న తరహా నీటిపారుదల శాఖ మెరుగైందన్నారు. ఆయన వ్యాఖ్యలను సీఎం కుమారస్వామి కొట్టివేశారు. కొందరు వ్యక్తులు కొన్ని శాఖల్లోనే పని చేయాలని కోరుకుంటారు. కానీ ప్రతి శాఖలోనూ సమర్థవంతంగా పని చేసేందుకు అవకాశం ఉన్నది అని అన్నారు. శాఖల కేటాయింపుల మీద అసమ్మతిపై సీఎం స్పందిస్తూ పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అసంతృప్తి త్వ‌ర‌లోనే స‌ద్దుమ‌ణుగుతుంద‌ని చెప్పారు.