Begin typing your search above and press return to search.

హెచ్ సీయూకి సెలవులు ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   23 March 2016 6:50 AM GMT
హెచ్ సీయూకి సెలవులు ఇచ్చేశారు
X
గతకొద్దికాలంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన హెచ్ సీయూలో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీకి వీసీగా వ్యవహరిస్తున్న అప్పారావు సెలవు మీద వెళ్లిపోయారు. మంగళవారం ఆయన వీసీగా ఛార్జ్ తీసుకోవటంతో ఆందోళనలు మొదలయ్యాయి.

వీసీ రాకను వ్యతిరేకిస్తున్న విద్యార్థి వర్గం.. వీసీ అతిధి గృహంపై దాడి చేసి.. ఫర్నీచర్ ను ధ్వంసం చేయటంతో పాటు.. పోలీసులు.. మీడియా మీద దాడికి పాల్పడటం తెలిసిందే. మరోవైపు బుధవారం హెచ్ సీయూలో నిర్వహించే సమావేశానికి ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య హాజరు కానున్నారన్న వార్త ఈ వేడిని మరింత పెంచింది. వర్సిటీలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు అదనపు భద్రతా బలగాలు మొహరించటంతో పాటు.. వర్సిటీలోకి అనుమతి విషయంలో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.

యూనివర్సిటీకిచెందిన వ్యక్తులకు మినహా మరెవరినీ అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వర్సిటీకి ఈ నెల27 వరకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలోకి రాజకీయ నాయకులు.. మీడియా ప్రతినిధులతో సహా.. బయటి వారు ఎవరిని లోపలకు అనుమతించకుండా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ హెచ్ సీయూకు వస్తారా? ఆయన పాల్గొనాల్సిన సభ జరుగుతుందా? అన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.