Begin typing your search above and press return to search.

టీ ఇంటర్ బోర్డును దులిపేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   13 Aug 2015 4:35 AM GMT
టీ ఇంటర్ బోర్డును దులిపేసిన హైకోర్టు
X
వెనుకా ముందు చూసుకోకుండా.. దూకుడే పరమావధిగా దూసుకెళ్లేలా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారులోని పలు విభాగాలకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. హైకోర్టు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతోంది. ప్రతి విషయంలోనూ ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదంగా మార్చే వైఖరిని అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ శాఖలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. ఏపీ ఇంటర్ బోర్డు నిధులున్న ఎస్ బీ ఐ ఖాతాలను స్తంభింప చేయాలంటూ తెలంగాణ ఇంటర్ విద్యామండలి లేఖ రాయటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిణగించింది. ఏ అధికారంలో ఇలాంటి పని చేశారని సూటిగా ప్రశ్నించింది. అసలు ఏ అధికారంతో లేఖ రాశారని ప్రశ్నించటమే కాదు.. వెనువెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలన్నారు.

ఖాతాల్ని స్తంభింపచేయాలన్న లేఖ వెనుక.. తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలంగాణ అధికారులు సమాధానం ఇచ్చారు. అలాంటప్పుడు ఏ అధికారంతో లేఖ రాస్తారని ప్రశ్నించగా.. ఈ వ్యాజ్యంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసును గురువారానికి వాయిదా వేశారు.

తెలంగాణ.. ఏపీల మధ్య విభజనలో భాగంగా ఇంటర్ బోర్డుల విభజన పూర్తి అయ్యింది. అదే సమయంలో.. ఏపీ ఇంటర్ బోర్డుకు ఎస్ బీ ఐలో బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేయాలని పేర్కొనటం వివాదం రేగింది. దీనిపై ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు లేఖతో బ్యాంకు ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రెండు బోర్డుల మధ్య విభజన ఒప్పందం కుదిరిన తర్వాత.. లేఖ రాయటాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలంటూ తెలంగాణ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది.

ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తారా అని సూటిగా ప్రశ్నించిన హైకోర్టుకు..అలా లేఖ రాయాలని తెలంగాణ ఏజీ చెప్పారన్నారు. దీనికి స్పందించిన హైకోర్టు ఏజీ అలా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి ఖాతా స్తంభన విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని లైన్ల ఆధారంగా ఎలా లేఖ జారీ చేస్తారని ప్రశ్నించటం.. దీనికి తెలంగాణ ఏజీ (అడ్వొకేట్ జనరల్) సమాధానం గురువారం సమాధానం ఇస్తారని చెప్పటంతో కేసును వాయిదా వేశారు. మరి.. ఈ విషయంలో హైకోర్టుకు తెలంగాణ ఏజీ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.