Begin typing your search above and press return to search.

మంత్రి కేటీఆర్ ఉండాల్సిన ఫోటోలో హరీశ్ ఉండటమా? ఎందుకిలా?

By:  Tupaki Desk   |   13 July 2021 4:36 AM GMT
మంత్రి కేటీఆర్ ఉండాల్సిన ఫోటోలో హరీశ్ ఉండటమా? ఎందుకిలా?
X
ఈ ఫోటోను చూసినంతనే తేడా ఇట్టే కనిపిట్టేస్తారు తెలంగాణ రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా. రాష్ట్రానికి వచ్చే ఏ ప్రముఖుడైనా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ లేదంటే మంత్రి కేటీఆర్ ను కలవటం.. ఆయనతో భేటీ కావటం.. దానికి సంబంధించిన వివరాల్ని కేటీఆర్ పేషీ ద్వారా బయటకు వస్తాయి. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ ఉండాల్సిన ఫోటోలో మంత్రి హరీశ్ రావు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ విషయం ఏమంటే.. తాజాగా సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ. సైమన్ వాంగ్ మంత్రి హరీశ్ ను కలిశారు.

తమ ప్రతినిధుల టీంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసిన ఆయన.. హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నట్లు అధికారిక ప్రెస్ నోట్ లో వెల్లడించారు. అయినా.. పరిస్థితి బాగోకపోతే.. సింగపూర్ హైకమిషనర్ లాంటి వారు దగ్గరకే రారు కదా? వచ్చారు..కలిశారు అంటేనే.. ఏదో లెక్క ఉంటేనో అవుతుంది కదా?

మంత్రి హరీశ్ తో భేటీ అయిన సింగపూర్ హై కమిషనర్ టీం.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పటంతో పాటు.. అందుకు సంబంధించిన రంగాల గురించి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. గ్రీన్ ఎనర్జీ.. ఫార్మాతో పాటు డేటా సెంటర్ల ఏర్పాటు పైనా తాము ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని..ఇప్పటికే అమెజాన్ తదితర సంస్థలు మహానగరిలో తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేసిన వైనాన్ని మంత్రి హరీశ్ వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి అవసరమైన ఫార్మా సిటీని భారీగా ఏర్పాటు చేస్తున్టన్లు చెప్పారు. సోలార్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనువైనదిగా చెప్పినట్లు తెలుస్తోంది.

సాధారణంగా అయితే.. సింగపూర్ హై కమిషనర్ లాంటి వారంతా మంత్రి కేటీఆర్ ను కలవటం.. ఆయనతో చర్చలు జరపటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా మంత్రి హరీశ్ కు పెద్దపీట వేయటం.. ప్రముఖులు ఆయన్ను కలవటం చాలా అరుదుగా జరిగేదన్న మాట వినిపిస్తోంది. రోటీన్ కు భిన్నంగా మారిన తాజా ఫోటో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మంత్రి ఈటలను బయటకు పంపిన తర్వాత నుంచి కేసీఆర్ సర్కారులో మంత్రి హరీశ్ కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. తాజా ఉదంతంతో అదెంతన్న విషయం మరోసారి రుజువైందని చెప్పాలి.