Begin typing your search above and press return to search.

అమెరికా విజిటర్ వీసాల కోసం 2 ఏళ్లు ఆగాల్సిందే

By:  Tupaki Desk   |   17 Sep 2022 4:30 PM GMT
అమెరికా విజిటర్ వీసాల కోసం 2 ఏళ్లు ఆగాల్సిందే
X
అమెరికా టూర్ కు ప్లాన్ చేస్తున్నారా? అగ్రరాజ్యంలో అలా విహరించడానికి వెళుతున్నారా? అయితే ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లడం కష్టమే. కనీసం రెండేళ్ల వరకూ కూడా ఖాళీలేని పరిస్తితి. అంతలా రష్ ఉంది మరీ.. అమెరికాకు సందర్శకుల వీసాల జారీలో విపరీతమైన జాప్యం భారతీయుల ప్రయాణ ప్రణాళికలు.. బడ్జెట్‌లను గందరగోళానికి గురిచేస్తోంది. మొదటిసారిగా అమెరికాకు వలసేతర విజిటర్ వీసా పొందాలనుకునే భారతీయ పౌరులు దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. వీసా కోరుకునే దరఖాస్తుదారులు ఢిల్లీ, ముంబైలో వరుసగా 758 మరియు 752 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతగా వెయిటింగ్ పీరియడ్ ఉంది.

విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునే దరఖాస్తుదారులు ముంబై , ఢిల్లీ రెండు నగరాల్లో అక్టోబర్ 2024 నాటికి అపాయింట్‌మెంట్ పొందుతారు. కేవలం ఒక నెల క్రితం.. సందర్శకుల వీసాల కోసం ఆశించే వారు వేచి ఉండే సమయం ఢిల్లీ , ముంబైలలో 581 మరియు 517 రోజులు ఉండేది. కరోనా మహమ్మారి తగ్గడంతో ఇప్పుడు అందరూ విదేశాలకు వెళ్లడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందుకోసం ఎగబడుతున్నారు. దీంతో వీరి ప్రయాణానికి డిమాండ్‌ కు సరిపడా అమెరికా ప్రభుత్వం వీసాల జారీని చేయడం లేదు. ఇది ఎక్కువ కాలం వేచిఉండేలా చేస్తోంది.

నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉంది. వచ్చే వేసవి నాటికి పరిస్థితిలో మెరుగుదల ఉండవచ్చు, భారతదేశంలోని అమెరికా ఎంబసీ కోవిడ్ ముందు చాలా సిబ్బందిని తొలగించింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ సిబ్బందిని పెంచాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వీసా తరగతులలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ఉన్నామని.. మహమ్మారి సమయంలో దాదాపు పూర్తి షట్‌డౌన్ తో వనరులను స్తంభింపచేసిన తర్వాత వీసా ప్రాసెసింగ్ సాధారణ స్థితికి వస్తోందని అమెరికా తెలిపింది.

ఈ వేసవిలో భారతదేశంలోని అమెరికా ఇమ్మిగ్రేషన్ రికార్డు స్థాయిలో 82,000 విద్యార్థి వీసాలను జారీ చేసింది. B1/B2 టూరిజం, వ్యాపార వీసాలు వేగవంతం అవుతున్నాయి. వచ్చే వేసవి నాటికి సిబ్బందిని పెంచుతామని.. ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని అమెరికా ఎంబసీలోని ఒక అధికారి తెలిపారు.

ఏది ఏమైనప్పటికీ సెప్టెంబరులో అమెరికాకి వెళ్లే అన్ని విమానాలు నిండినందున ప్రయాణాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ అమెరికా వీసా దొరక్క వెళ్లలేని వారు కెనడా విద్యార్థి వీసాలను పొందుతున్నారు. అనేక వన్-స్టాప్ విమానాలు కెనడాకు బయలుదేరే విద్యార్థులతో నిండి ఉన్నాయి. విద్యార్థుల రద్దీ తగ్గిన తర్వాత ఛార్జీలు కూడా సరసమైన స్థాయికి వస్తాయని ట్రావెల్ ఏజెంట్ చెప్పారు.

వీసాల జారీలో జాప్యం ప్రధానంగా మొదటిసారి వీసా దరఖాస్తుదారులకు మాత్రమే. ఇదివరకు వెళ్లినవారు.. మరోసారి వెళ్లాలనుకునే వారికి వీసాలు త్వరగానే లభిస్తున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ఈ జాప్యం జరుగుతోందని అమెరికా ఎంబసీలోని మరో అధికారి తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.