Begin typing your search above and press return to search.

హ‌త్రాస్ బాధితురాలి తండ్రి హ‌త్య‌.. కాల్చి చంపిన హ‌త్యాచార‌ నిందితుడు!

By:  Tupaki Desk   |   2 March 2021 3:30 PM GMT
హ‌త్రాస్ బాధితురాలి తండ్రి హ‌త్య‌.. కాల్చి చంపిన హ‌త్యాచార‌ నిందితుడు!
X
దేశంలో పెను సంచలనం రేకెత్తించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని హత్రాస్ హ‌త్యాచార బాధితురాలి తండ్రి హ‌త్య‌కు గుర‌య్యాడు. బాధితురాలిని హ‌త్యాచారం చేశాడ‌ని అభియోగం ఎదుర్కొంటున్న నిందితుడే కాల్చి చంపాడు. బెయిలుపై బ‌య‌ట‌కు వ‌చ్చిన నిందితుడు మ‌రోసారి దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఈ విషయాన్ని పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఘోరంతో దేశం మ‌రోసారి ఉలిక్కిప‌డింది.

హత్రాస్ హత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న గౌర‌వ్ శ‌ర్మ‌.. 2018లో జైలు కెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అతను ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గ్రామానికి సమీపంలోని ఓ దేవాలయం దగ్గర బాధిత కుటుంబం, నిందితుడి కుటుంబం మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే కాల్పులు జరపడంతో.. బాధితురాలి తండ్రి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించిన్పటికీ.. ఫలితం లేకుండాపోయిందని, బాధితురాలి తండ్రి మరణించాడని పోలీసులు తెలిపారు.

పోలీసు అధికారి వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఆ రెండు కుటుంబాలకూ అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో నిందితుడు భార్య, బంధువుతో కలిసి దేవాలయానికి వెళ్లారు. అక్కడే మృతుడి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెరగడంతో.. నిందితుడు వెళ్లి తన కుటుంబానికి చెందిన కొంత మంది కుర్రాళ్లను తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశాం’’. అని జైస్వాల్ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు.

ఈ ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. అధికారులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం… ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కఠిన శిక్షలు పడాలని ఆదేశించారు. కాగా.. ఈ ఘటనపై స్థానిక జర్నలిస్టులు కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు గౌరవ్ శర్మకు అప్పుడే శిక్ష అమలు చేసి ఉంటే.. ఈ దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.