Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్టు: హాథ్రస్ బాలిక ఊరు ఇప్పుడెలా ఉంది?

By:  Tupaki Desk   |   3 Oct 2020 11:45 AM IST
గ్రౌండ్ రిపోర్టు: హాథ్రస్ బాలిక ఊరు ఇప్పుడెలా ఉంది?
X
ఒక దారుణ ఘటన జరిగింది. దేశ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. సంచలనంగా మారిన ఆ ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ.. కేంద్రానికి కానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి చుక్కలు చూపించటమే కాదు.. ఐరన్ కర్టెన్ మాదిరి పరిస్థితిని తీసుకురావటం దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హాథ్రస్ దళితే బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతం నేపథ్యంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్.. ప్రియాంకలు బయలుదేరటం.. వారిని మధ్యలో ఆపేయటం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ దారుణ ఘటనకు వేదికగా నిలిచిన గ్రామంలో యూపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. బాధితురాలి గ్రామంలోకి ఎవరూ లోపలకు వెళ్లకుండా ఊరు చుట్టూ పోలీసులు పహరా కాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. సిట్ దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిరసలనకు అనుమతించరాదని యోగి సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఊరి చుట్టూ బారికేడ్లు నిర్మించటంతో పాటు.. గ్రామంలో 144 సెక్షన్ పెట్టారు. గ్రామం లోపలకు ఎవరూ వెళ్లకుండా చేయటం.. గ్రామంలో ఎవరూ మాట్లాడకుండా తీవ్ర ఆంక్షలు పెట్టారు. అంతేకాదు.. ఆ ఊరి వాళ్లు సైతం మీడియాతో మాట్లాడేందుకు అనుమతించటం లేదు. దీంతో.. గ్రామం బయటనే మీడియా ఉండిపోవాల్సి వస్తోంది. ఇక.. బాధిత కుటుంబం దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కొన్నట్లుగా సమాచారం అందుతుంది. పోలాల్లో నక్కుతూ ఊళ్లోకి రహస్యంగా వెళ్లే ప్రయత్నం చేసిన కొందరు మీడియా ప్రతినిధుల్ని పోలీసులు అడ్డుకున్నారు.

గ్రామంలోకి అనుమతించే అవకాశం లేదని తేల్చారు. దీంతో మీడియాకు.. పోలీసులకు మధ్య హాట్ హాట్ వాదన జరుగుతోంది. ఏ నిబంధన ప్రకారం తమను ఆపుతున్నారని అడిగితే.. తమకు అవన్నీ తెలివని.. పై అధికారులు అనుమతించొద్దని చెప్పారని.. తాము ఆ మాటల్ని పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఒక విషయాన్ని ప్రపంచానికి తెలీకుండా యోగి సర్కారు చేస్తున్న పాట్లు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ఇంత దాపరికంతో ప్రభుత్వం మరింత బద్నాం కావటం తప్పించి మరేమీ ఉండదు. ఆ చిన్న విషయాన్ని యోగి సర్కారు ఎందుకు మిస్ అవుతున్నట్లు..?