Begin typing your search above and press return to search.

ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న హాథ్రస్ బాధిత కుటుంబం

By:  Tupaki Desk   |   8 Oct 2020 11:30 AM IST
ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న హాథ్రస్ బాధిత కుటుంబం
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ ఉదంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరేళ్లు దాటేసిన మోడీ సర్కారు పాలనతో ఎప్పుడూ ఎదుర్కోని గడ్డు పరిస్థితిని ఆయన తాజాగా ఎదుర్కొంటున్నారు. ఏ ఎపిసోడ్ లోనూ మోడీ ఇమేజ్ ఇంతలా డ్యామేజ్ కాలేదన్న మాట వినిపిస్తోంది. పందొమ్మిదేళ్ల యువతిని అత్యంత దారుణంగా హింసిస్తూ గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంలో యూపీ సర్కారు అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధిత కుటుంబానికి బాసటగా నిలవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అసలు అలాంటి ఘటన జరగలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ధోరణిని తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరితే.. వారిని నిలువరించే ఎపిసోడ్ లో అటు మోడీ సర్కారు.. ఇటు యోగిసర్కారు తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటున్నరు. నిరసనల్ని.. ఆందోళనల్ని ఇంతలా తొక్కి పట్టటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయం మీద దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు పెల్లుబుకుతుంటే.. సదరు బాధిత కుటుంబం పరిస్థితి ఇప్పుడెలా ఉంది. వారేం అనుకుంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే షాకింగ్ అంశాలు బయటకు వస్తాయి. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి వారిప్పుడు మాట్లాడేందుకు భయపడుతున్నారట. ఉన్న ఊళ్లో ఎవరి సాయం అందని వారు.. ఇప్పుడు అక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

భయం గుప్పిట్లో బతుకుతున్నామని.. ఊరు విడిచి వెళ్లిపోవటం మినహా మరే గత్యంతరం తమకులేదని చెబుతున్నారు. గ్రామంలో ఏ ఓక్కరు బాధిత కుటుంబానికి అండగా నిలిచే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. అందుకే తామున్న భోల్ గరీ గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లాలని భావిస్తున్నారు. ఎవరైనా బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఊళ్లో ఏ ఒక్కరు తమకు అండగా నిలవటం లేదని.. తమతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని.. పరిస్థితులు భయంకరంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక దారుణ ఉదంతంలో బాధిత కుటుంబం ఇంత భయంగా భయంగా బతకాల్సి రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.