Begin typing your search above and press return to search.

ఇపుడే జగన్ కు సమస్య మొదలయ్యిందా ?

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:00 AM IST
ఇపుడే జగన్ కు సమస్య మొదలయ్యిందా ?
X
‘ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది’ అని అధికార వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి అందులో ఇల్లు నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇందుకు శ్రీకారం కూడా చుట్టారు. అయితే ఎవరో కోర్టులో కేసు వేయటంతో హైకోర్టులో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. దీంతో పేదలందరికీ ఇళ్ళ పథకం నిలిచిపోయింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది.

మంగళవారం కేసును విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దాంతో పేదలందరికీ ఇళ్ళు నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన మళ్ళీ మొదలవ్వబోతోందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. డివిజన్ బెంచ్ తీర్పుతో ‘ఇల్లు అలకగానే పండగైనట్లు కాదు’ అనే సామెత గుర్తుకొస్తోంది. ఎందుకంటే పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేసింది కానీ ఇల్లు నిర్మించాలంటే మాటలుకాదు.

ఎందుకంటే పట్టాలివ్వటం ప్రభుత్వం చేతిలోని పనే కాబట్టి చేసేసింది. పట్టాలివ్వటానికి డబ్బు ఖర్చు లేదు కాబట్టి సరిపోయింది. కానీ అందులో ఇల్లు నిర్మించాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం. జగన్ అంచనాల ప్రకారం సుమారు 30 లక్షల ఇళ్లు నిర్మాణాలు జరగాలి. అన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ? ఇందులో లబ్దిదారులు కొంత భరించినా, మరికొంత బ్యాంకులతో లింకేజీ ఏర్పాటు చేసినా కూడా ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదన్నది వాస్తవం.

పేదల ఇళ్ల నిర్మాణానికి సింగిల్ బెంచ్ స్టే ఇచ్చి జగన్ నెత్తిన కోర్టు పాలుపోసిందనే కామెంట్లు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర లేవని అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకేసారి కాకపోయినా దశలవారీగా ఇళ్ళు నిర్మించాలన్నా కూడా ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రభుత్వానికి ఇబ్బందే. ఇళ్ళ నిర్మించి ఇస్తామనే హామీకన్నా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకునుంటే సింపుల్ గా అయిపోయేది.

ఇళ్ల స్ధలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఖర్చంతా లబ్దిదారులే పెట్టుకునే వారు కాబట్టి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడేదికాదు. కానీ జగన్ అలా చేయకుండా ఇళ్ళపట్టాలివ్వటమే కాకుండా ఇళ్ళ నిర్మాణాలను కూడా తలకెత్తుకోవటంతోనే సమస్య వచ్చింది. ఇంతకాలం సింగిల్ బెంచ్ స్టేతో ప్రభుత్వం కాలాన్ని నెట్టుకొచ్చింది. ఇపుడు డివిజన్ బెంచ్ స్టే ఎత్తేయటంతో ప్రభుత్వానికి అసలైన సమస్య మొదలైనట్లే అనుకోవాలి. మరి ఈ సమస్యను జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాల్సిందే.