Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఏటీఎంగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిందా?

By:  Tupaki Desk   |   6 May 2022 5:00 AM GMT
కేసీఆర్ కు ఏటీఎంగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిందా?
X
కేంద్రంలోని మోడీ సర్కారుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కత్తి దూయటం.. అందుకు ఏ మాత్రం తగ్గని బీజేపీ అంతే ఒడుపుగా కత్తి తిప్పటం ద్వారా తెలంగాణలో కొత్త రాజకీయ సమరానికి తెర తీశారని చెప్పాలి.

తాజాగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంతవరకు కేసీఆర్ అవినీతి గురించి రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారే తప్పించి.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో కీలకంగా వ్యవహరించే వారి నోటి నుంచి ఘాటు పదజాలంతో వ్యాఖ్యలు వచ్చింది లేదు.

ఆ కొరతను తీరుస్తూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. కేసీఆర్ మీద కమలనాథుల యుద్ధం పీక్స్ కు చేరిందని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు పాలిచ్చే ఆవులా మారిందని.. ఏటీఎం అయ్యిందని మండిపడ్డారు. వేలాది కోట్ల రూపాయిలతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు చుక్కనీరు అందలేదన్నారు. నీటిపారుదల రంగంలో అవినీతి జరుగుతోందని.. దీని కారణంగా ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు.

రూ.20 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని.. ఒక్క ఇంచు భూమికి సాగునీరు అందలేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి, రాజోలి బండ, నెట్టెంపాడు, డిండి ప్రాజెక్టులు విఫలమయ్యాయని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తప్పుడు వ్యక్తి కారణంగా కేంద్రం ుంచి వచ్చే నిధులు పక్కదారి పట్టటం గమనార్హం. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన ప్రధాని మోడీ పత్తి క్వింటాలు మద్దతు ధరను రూ.5200 నుంచి రూ.10 వేలకు పెంచిన వైనాన్ని గుర్తు చేశారు.

మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ లో భారీ అవినీతి జరిగిందని.. భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నీళ్లు వచ్చింది లేదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి రాష్ట్రం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి డబుల్ బెడ్రూం ఇళ్లగా పేరు మారిస్తే..సమగ్ర శిక్ష అభియాన్ కు మన ఊరు - మన బడిగా పేర్లు మార్చిందన్నారు. ప్రధాని పంపిన డబ్బుల్ని రాష్ట్రం సరిగా ఖర్చు చేయటం లేదన్న ఆయన మాటలు కేసీఆర్ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారాయన్న మాట వినిపిస్తోంది.