Begin typing your search above and press return to search.

పారా హుషార్ : భయం అంటే ఏమిటో బీజేపీ చూపించిందా...?

By:  Tupaki Desk   |   24 Jun 2022 4:30 PM GMT
పారా హుషార్ : భయం అంటే ఏమిటో బీజేపీ చూపించిందా...?
X
భయం అంటే ఇదీ. దాని విశ్వరూపం చూడాలనుకోకు. చూస్తే మాత్రం సీన్ ఇలాగే ఉంటుంది. ఇదేనా కాషాయదళం టోకున దేశంలోని రాజకీయానికి ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలకు చెప్పాలనుకుంటోంది. అంటే జవాబు అవును అని వస్తుందేమో. ఇంతకీ బీజేపీ చూపించిన భయమేంటి వణుకుతోంది ఎవరూ అంటే ఒక్కసారిగా మహారాష్ట్ర వైపు సీన్ వేసుకొవాల్సిందే.

పాతికేళ్ళకు పైగా స్నేహ బంధం. రెండు పార్టీల భావజాలం కూడా ఒక్కటే. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కాంగ్రెసే. అలా చెట్టపట్టాలు వేసుకుని 1993లో ఫస్ట్ టైమ్ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని స్థాపించాయి బీజేపీ శివసేన. నాడు బాల్ థాక్రే కనుసన్నలలో ప్రభుత్వం నడిచింది. అప్పట్లో బీజేపీకి మహారాష్ట్రలో ఎదురుగున్న దశ. సీనియర్ పార్టనర్ గా శివసేన ఉంది.

దేశంలో కూడా బీజేపీ ఇంకా అధికారంలోకి రాని రోజులు. అలా శివసేన అడుగులో అడుగు వేసి బీజేపీ నాడు ప్రభుత్వంలో కొనసాగింది. ఆ తరువాత చకచకా రాజకీయ పరిణామాలు మారాయి. 1998లో వాజ్ పేయి అధికారంలోకి రావడం ఆరేళ్ళ పాటు ఆయన ప్రధానిగా ఉండడంతో మహారాష్ట్రలో బీజేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించింది. ఆ మీదట కొంతకాలానికి బాల్ థాక్రే మరణించడం, నంబర్ టూ గా ఉన్న రాజ్ థాక్రే బయటకు వెళ్ళడం, సొంత కుమారుడు ఉద్ధవ్ థాక్రేకి అంతలా పట్టు లేకపోవడం ఇవన్నీ కలసి బీజేపీ ప్లేస్ ని పెంచేశాయి.

అలా ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ నుంచి పెద్దన్న పాత్రకు బీజేపీ ఎగబాకింది. ఒక టెర్మ్ అలాగే సొంతంగా పాలించింది కూడా ఇక 2019 లో మాత్రం ఇద్దరు కలసి పోటీ చేసినా సీట్లు బీజేపీకి ఎక్కువ రావడంతో సీఎం పోస్టును శివసేనకు ఇచ్చేందుకు ససేమిరా అంది. అలా మొదలైన మిత్రుల యుద్ధం ఇపుడు ఏకంగా శివసేన అంతు చూసేదాకా కధ సాగుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాలీ అంటే మూడు దశాబ్దలా మిత్రుడి దగ్గర తేడా వస్తేనే ఇంతలా చేసి భయం అన్నది నేర్పిస్తున్న కాషాయ దళం దేశంలో మిగిలిన పార్టీల విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది చెప్పేందుకే.

బీజేపీని నమ్మి ఈ రోజు ఎవరైనా స్నేహాం చేసినా రేపటి రోజులు ఎలా ఉంటాయో వారు ఒక్కసారి అలోచించుకోవాల్సిందే. ఇక ఏపీకి వస్తే వైసీపీ బీజేపీతో ఉంటోంది. పూర్తిగా మద్దతు ఇస్తోంది. రేపటి రోజున 151 సీట్లకు బదులు ఏ వందో వచ్చి బొటాబొటి మద్దతుతో అధికారంలో ఉంటే మహారాష్ట్ర రాక్షస క్రీడ ఇటువైపునా చూసే ప్రమాదం ఉందని విశ్లేషణలు ఉన్నాయి.

వైసీపీ మాత్రమే కాదు టీడీపీ నెగ్గినా కూడా పవర్ కావాలీ అనుకుంటే సీన్ మార్చేసే శక్తి తమకు ఉందని చెప్పడానికే ఈ మహారాష్ట్ర ఎపిసోడ్ కి తెర తీశారు అంటున్నారు. కేసీయార్ కి కూడా ఈనాడు వచ్చిన సీట్లూ ఓట్లూ వచ్చే ఎన్నికల్లో రాకపోతే అక్కడా రాజకీయం మారడం ఖాయం.

మొత్తానికి ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉండరాదు అని బీజేపీ శపధం పట్టిన వేళ తన పర భేదాలను కూడా తుడిచిపెట్టి శివసేన కూశాలనే కదిలిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనించడమే కాదు, తమను తాము సరికొత్తగా ధీటుగా మార్చుకుని దిద్దుకోకపోతే మాత్రం ఈ రోజు శివసేన రేపు ఎవరో అన్నది కాలమే చెబుతుంది మరి.